– నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడో?
– అధికార పార్టీ నేతల నిరీక్షణ
నవతెలంగాణ – సిరిసిల్ల
అధికార కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతలు ముఖ్య నాయకులు పార్టీ అధిష్టానం వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లాలో నామినేటెడ్ పదవులపై పలువురు ఆశలు పెంచుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంకా నామినేటెడ్ పదవుల ఉసేత్తడం లేదు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారు కొందరైతే కీలకమైన సమయంలో నమ్మకంగా పనిచేసిన నేతలు ఇంకొందరు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నామినేటెడ్ పోస్టుల పై జిల్లా నేతలు ఆశలు పెట్టుకున్నారు. పార్టీకి అంకితభావంతో పనిచేసిన వారికి తప్పకుండా పదవులు వస్తాయని నమ్మకంగా ఉన్న వారిని వెతికి మరి సముచిత స్థానం అప్పగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏ పదవి లేకుండా ఎంతో కాలంగా ఉన్న నేతలు ఎవరికి వారు నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నామినేటెడ్ పదవులు ఉన్నాయని, పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు వస్తాయని బహిరంగంగానే స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన జీవోలు వెలువడుతున్న తరుణంలో రాజన్న సిరిసిల్లకు సంబంధించిన పలు పోస్టుల భర్తీ పై నాయకులు ఆశలు పెంచుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా మూడో స్థానం…
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో బీజేపీ ఉండగా, రెండో స్థానం బీఆర్ఎస్ పదులపరుచుకుంది. అధికార పార్టీ జిల్లాలో మూడో స్థానంలోకి వెళ్ళగా రాష్ట్ర నేతలు దీనిపై పలు కోణాల్లో పార్టీ నేతలను విచారించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి ప్రతినిధులను పంపించి ఎందుకు అధికార పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెనుకబడిందని విచారించారు. సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల్లో సరైన ఫలితాలు రాకపోవడంతో నాయకులు కూడా నామినేటెడ్ పోస్టులు అడగడానికి ఆలోచనలో పడ్డారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కోరుతున్నప్పటికీ, పట్టణంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో పట్టణానికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వద్దని మండలాలకు సంబంధించిన నేతలకు ప్రాధాన్యత కల్పించాలని వారు కోరుతున్నారు.
సిరిసిల్లలో డీలా పడిన కాంగ్రెస్..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది ప్రస్తుత పరిస్థితుల్లో సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీలో నేతలు కనిపిస్తున్నారే తప్ప, కార్యకర్తలు మాత్రం కనిపించడం లేదు రాష్ట్ర అధినాయకత్వం ఏదైనా పిలుపు ఇచ్చినప్పుడు ఈ నాయకులు వచ్చి కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం అందిస్తున్న ఫలితాలను ప్రజలకు వివరించిన దాఖలాలు కనిపించడం లేదు. ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేస్తే నాయకులు మాత్రమే ఆ కార్యక్రమానికి వస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో 8 మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ పార్టీ బలోపేతం కావడంలో విఫలమైనట్లు కనిపిస్తుంది. ఇప్పటికి కూడా సిరిసిల్లలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నట్లు చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ రాష్ట్ర అధినాయకత్వం ఎలాంటి పిలుపు ఇచ్చిన అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పార్టీ పిలుపును అందుకొని వస్తూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో మాత్రం పదవుల పైనే నేతలు దృష్టి పెట్టారని చెప్పవచ్చు.
రాష్ట్రస్థాయి పదవుల పై గురి..
జిల్లాలోని పలువురు నేతలు రాష్ట్రస్థాయి పదవుల పై ఆశలు పెట్టుకున్నారు రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్ల పదవులు ఉన్నాయి. జిల్లా స్థాయిలో పలు ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి ప్రస్తుతం వేములవాడ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలిపై కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ గత ప్రభుత్వం వేములవాడ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది అలాగే ఉంచుతారా లేదా పాలకమండలి ఏర్పాటు చేస్తారా అనేది నేతల్లో సందిగ్ధత నెలకొంది. అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ అనే నామినేటెడ్ పోస్ట్ ను గత ప్రభుత్వం భర్తీ చేయకుండా ఉంచింది. ఈ ప్రభుత్వం ఆ పోస్టును భక్తి చేస్తుందా లేదా అనే ఆలోచనలో పార్టీ నేతలు ఉన్నారు ప్రధానంగా పార్టీలో ఉన్న నేతలు నామినేటెడ్ పదవుల్లో ఏదో ఒక్కటి దక్కించుకొని ప్రోటోకాల్ పరిధిలో ఉండాలని పలువురు నేతలు ఆశిస్తున్నారు.
పదవుల ఆశలో నేతలు..
సిరిసిల్ల నియోజకవర్గం లోని పదవుల కోసం అనేకమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో ఎదురుచూస్తున్నారు సిరిసిల్ల పట్టణంలోని నాగుల సత్యనారాయణ గౌడ్ గడ్డం నరసయ్య ఆకునూరి బాలరాజు సంగీతం శ్రీనివాస్ వైద్య శివప్రసాద్ సుర దేవరాజు వేల్ముల తిరుపతిరెడ్డి ఎల్లే లక్ష్మీనారాయణ గోనె ఎల్లప్ప భీమవరం శ్రీనివాస్ తంగళ్ళపల్లి మండలంలోని జలగం ప్రవీణ్ కుమార్ మునిగల రాజు బైరినేని రాము గుగ్గిళ్ళ శ్రీకాంత్ లింగాల భూపతి సత్తు శ్రీనివాసరెడ్డి తిరుపతి యాదవ్ ముస్తాబాద్ మండలంలోని చక్రధర్ రెడ్డి బాల్ రెడ్డి గజ్జల రాజు శ్రీనివాస్ గౌడ్ భాను కుమార్ చీటీ నర్సింలు తిరుపతి ఎల్లారెడ్డిపేట మండలంలోని దొమ్మాటి నరసయ్య నేవూరి వెంకట్ రెడ్డి గౌస్ పాషా సద్దు లక్ష్మారెడ్డి గంభీరావుపేట మండలంలోని కటకం మృత్యుంజయం గాంధీ బాబు గోరంటాల తిరుపతి అమిద్ పాప గారి రాజు గౌడ్ వీర్నపల్లి మండలంలోని దేవేందర్ యాదవ్ రాములు నాయక్ పరుశరాములు తిరుపతి యాదవ్ శ్రీనివాస్ గౌడ్ లు పదవుల రేస్ లో ఉన్నారు.
మార్కెట్ కమిటీల పై నేతల చూపు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గంలోని పలు నామినేటెడ్ పదవులు ఉండగా వాటిపై స్థానిక నేతలు ఆశలు పెంచుకున్నారు. వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీలు చొప్పదండి పరిధిలోని బోయినపల్లి ఏఎంసి మానకొండూరు పరిధిలోని ఇల్లంతకుంట ఏఎంసి పోస్టులు ఉన్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ గంభీరావుపేట ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల మార్కెట్ కమిటీలు త్వరలోనే భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సిరిసిల్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పోచమ్మ ఆలయం శివాలయం సాయిబాబా ఆలయాలకు సంబంధించిన పాలకవర్గాలను త్వరలోనే నియామకం జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోస్టు కోసం రెండు నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సిరిసిల్ల నియోజకవర్గంలోని కేకే మహేందర్ రెడ్డి ని వేములవాడ నియోజకవర్గం లోని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావాహులు కలిసి పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నారు.