ఈ-కేవైసీ గందరగోళం ముగిసిన గడువు

E-KYC is a mess Expired– పూర్తికాని రేషన్‌కార్డు, ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ
– అసలే పరీక్షల సీజన్‌
– విద్యార్థులకు నష్టం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు అనుసంధాన ప్రక్రియ గందరగోళంలో పడింది. ఈ ప్రక్రియ సెప్టెంబర్‌ 5, 2023న ప్రారంభమైంది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసింది. అయితే ఇప్పటి వరకు కేవైసీ చేయించుకోలేని వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం కేవైసీ గడువును పొడిగిస్తుందా? లేదా? అనే విషయాన్ని ఇంకా తేల్చలేదని అధికారులు చెబుతున్నారు. రేషన్‌కార్డు యాజమానితోపాటు కుటుంబ సభ్యులందరూ రేషన్‌ డీలర్ల వద్ద ఈ కేవైసీ చేసుకోవాలని గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రేషన్‌ సరకులు పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతో, కేవలం కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులకే బియ్యం అందాలని రాష్ట్రంలో రేషన్‌కార్డుల వెరిఫికేషన్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రేషన్‌ కార్డ్‌ కేవైసీని ప్రభుత్వం చేపట్టింది. ‘ఈ పాస్‌ యంత్రం’ ద్వారా ప్రతీ లబ్ధిదారుడు కేవైసీ చేసుకోవాలని గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలిపింది. ఫిబ్రవరి 29తో కేంద్రం విధించిన గడువు ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం గడువు పొడిగించాలని కోరుతుందా? లేదా? అనేది చూడాలి. ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేయించుకోకపోతే సదరు సభ్యుడి కోటా రేషన్‌ కట్‌ అయినట్టే. దీంతో రాష్ట్రంలో రేషన్‌కార్డుదారులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా విద్యార్ధులకు నష్టం జరగనుంది. తమ పిల్లలు నష్టపోయే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆవేదనకు గురి అవుతున్నారు. అసలే పరీక్షల సీజన్‌ నడుస్తున్నది. లక్షలాది మంది విద్యార్థులు ఎక్కడెక్కడో హాస్టళ్లల్లో చదువుతున్నారు. పరీక్షల సమయంలో అక్కడి నుంచి వచ్చి ఈ కేవైసీ చేసుకోవడం సాధ్యం కావట్లేదని చెబుతున్నారు. ఇప్పటికే ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ నెలలో పదవ తరగతి పరీక్షలు ఉన్నాయి. ఈ సమయంలో విద్యార్థులు వచ్చి ఈ కేవైసీ చేయించుకోవడం ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో మొత్తంగా రేషన్‌కార్డుదారులు 90 లక్షల మంది ఉన్నారు. అందులో కుటుంబ సభ్యులు 2.90 కోట్ల మంది ఉన్నారు. ఇప్పటికే 85శాతం మంది ఈ కేవైసీ చేయించుకున్నారు. మిగిలిన వారిలో అత్యధికంగా విద్యార్థులు, విదేశాల్లో ఉన్న వారు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మరికొంత మంది చనిపోయారు. ప్రభుత్వ హాస్టళ్లల్లో చదువుకుంటున్న పిల్లలు నిరుపేద కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. వారంతా దసరా, సంక్రాంతి పండుగులకు వచ్చి రేషన్‌కార్డు ఈ కేవైసీకి ప్రయత్నించినా, చాలా చోట్ల నెట్‌వర్క్‌ సమస్య తలెత్తింది. కొన్ని సార్లు రేషన్‌దుకాణాలు బంద్‌ ఉన్నాయి. ప్రతినెల 15 తేదీలోపు మాత్రమే రేషన్‌దుకాణాలు తెరచి ఉంటాయి. ఆ సమయంలో విద్యార్థులు ఇంటికి వచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని చెబుతున్నారు.
బాసర ఐఐటీలో స్వయంగా అధికారులు వచ్చి ఈ కేవైసీ చేయించారు. ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్‌ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తులు తీసుకున్నారు. ఇది మంచి పరిణామమే కానీ అన్ని విద్యా సంస్థల్లో అటువంటి ప్రయత్నం జరగలేదు. ఆ కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులందరూ సమీపంలోని రేషన్‌ దుకాణానికి వెళ్లి ‘ఈ పాస్‌’ మిషన్‌లో మళ్లీ వేలిముద్రలు వేయాలి. వేలిముద్ర తీసిన తర్వాత అతని ఆధార్‌ కార్డు నంబర్‌తో పాటు రేషన్‌ కార్డు నంబర్‌ డిస్‌ప్లే అవుతుంది. ఆ తర్వాత గ్రీన్‌లైట్‌ వచ్చి కేవైసీ అప్‌ డేట్‌ పూర్తవుతుంది. రెడ్‌ లైట్‌ ఆన్‌లో ఉంటే, రేషన్‌కార్డ్‌ కేవైసీ ఇంకా చేసుకోలేదనేది తెలిసిపోతుంది. కేంద్రం ఇప్పటికైనా ఈ కేవైసీ గడువును పొడిగిస్తే పేదలకు మేలు జరుగుతుందనీ, లేకపోతే తమ పిల్లల రేషన్‌ కట్‌ అవుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.