– చివరి టెస్టుకు సిద్ధమైన వార్నర్
– ఆసీస్, పాక్ మూడో టెస్టు నేటి నుంచి
సిడ్నీ (ఆస్ట్రేలియా) : ఆస్ట్రేలియా ఆధునిక క్రికెట్ దిగ్గజం డెవిడ్ వార్నర్ రిటైర్‌మెంట్‌కు రంగం సిద్ధం చేసుకున్నాడు. సొంత మైదానం సిడ్నీలో టెస్టులకు వీడ్కోలు పలికేందుకు సిద్ధమై.. ఆఖరు నిమిషంలో వన్డేలకు వీడ్కోలు ప్రకటించాడు. వార్నర్ వీడ్కోలుకు సిడ్నీ మైదానం ముస్తాబు కాగా.. పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్ కోసం కంగారూలు రెఢ అవుతున్నారు. 2-0తో టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా.. చివరి టెస్టులోనూ పాక్‌పై విజయం కోసం బరిలోకి దిగుతోంది. మరోవైపు సిరీస్ ఓడినా.. మెల్‌బోర్న్‌లో ఆతిథ్య జట్టుకు ఝలక్ ఇచ్చింది పాక్. సిడ్నీలో వార్నర్ మేనియా కొనసాగినా.. ఆసీస్‌కు గట్టి పోటీ ఇవ్వగల దీమాతో కనిపిస్తోంది. ఆసీస్ మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుండగా.. పాక్ కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోయింది. షహీన్ షా అఫ్రిది, ఇమామ్ ఉల్ హాక్‌లు సిడ్నీ టెస్టుకు దూరమయ్యారు.