– ఏప్రిల్ 1 నుంచి నూతన నిబంధనలు
– అమలును వాయిదా వేయాలని కోరిన వ్యాపారులు
న్యూఢిల్లీ : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగానికి సకాలంలో బకాయిల చెల్లింపులు జరిగేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన నిబంధనలను అమలు చేయబోతోంది. ఇవి వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. దీని ప్రకారం ఎంఎస్‌ఎంఈలకు బకాయి పడిన కంపెనీలు 45 రోజుల్లోగా వాటిని చెల్లించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో బకాయిలపై పన్ను మినహాయింపులు ఇవ్వరు. ఎంఎస్‌ఎంఈలకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడడానికి ఫైనాన్స్ చట్టం ఆదాయపన్ను చట్టానికి సవరణను తీసుకొచ్చింది. అందుకోసం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 43బీలో క్లాజ్ (హెచ్)ని చేర్చింది.
ఈ క్లాజు ప్రకారం ఎంఎస్‌ఎంఈలకు జరగాల్సిన ఏ చెల్లింపులైనా 45 రోజుల్లో పరిష్కారం కాకపోతే ఆ బకాయిలు చెల్లించే వరకూ వాటికి పన్ను మినహాయింపులు వర్తించవు. ఎంఎస్‌ఎంఈలకు బడా కంపెనీలు సకాలంలో బకాయిలు చెల్లించేలా చూడడమే దీని ఉద్దేశం. దీనివల్ల చిన్న చిన్న వ్యాపారాలకు అనువైన ఆర్థిక వాతావరణం ఏర్పడుతుంది. 2006వ సంవత్సరపు ఎంఎస్‌ఎంఈడీ చట్టం కింద నమోదైన కంపెనీల నుంచి వస్తువులు, సేవల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలకు సెక్షన్ 43బీ (హెచ్) వర్తిస్తుంది.ఆదాయపన్ను చట్టంలో ఈ సెక్షన్‌ను గత సంవత్సరం ప్రవేశపెట్టారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సకాలంలో బకాయిలు చెల్లించేలా చూడడమే దీని లక్ష్యం. ఎంఎస్‌ఎంఈలకు సకాలంలో సొమ్ము చెల్లించని పక్షంలో బడా కంపెనీలు తమ పన్ను ఆదాయం నుండి ఆ ఖర్చును మినహాయించలేవు. దీనివల్ల పన్ను భారం పెరుగుతుంది. మన దేశంలోని కంపెనీలు చెల్లింపులు జరిపినా లేకపోయినా తాము పెట్టిన ఖర్చులను నమోదు చేస్తుంటాయి. ఎంఎస్‌ఎంఈడీ చట్టంలోని సెక్షన్ 15, తాజాగా ఆదాయపన్ను చట్టంలో చేర్చిన సెక్షన్ ప్రకారం ఎంఎస్‌ఎంఈ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను 15 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. లేదా పరస్పర అంగీకారంతో 45 రోజుల్లో పరిష్కరించుకోవచ్చు. కాగా ఈ క్లాజును 2025 ఏప్రిల్ వరకూ అమలు చేయవద్దని వ్యాపారుల సంఘం సీఏఐటీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. వ్యాపారులకు వర్తించే చట్టంపై, కొన్ని నిబంధనలపై స్పష్టత లేనందున అమలును వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది. నూతన క్లాజు నేపథ్యంలో ఎంఎస్‌ఎంఈ సంస్థలకు ఇచ్చిన ఆర్డర్లను రిటైల్ వ్యాపారులు రద్దు చేసుకునే అవకాశం ఉన్నదని వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం (సీఎంఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది. రిటైల్ పరిశ్రమ సాధారణంగా బకాయిల చెల్లింపునకు 90-120 రోజుల సమయం తీసుకుంటుందని, కొన్ని సందర్భాలలో దానిని 180 రోజులకు పొడిగిస్తుందని గుర్తు చేసింది. అలాంటప్పుడు 45 రోజుల్లోనే బకాయిలు చెల్లించాలని గడువు విధించడం సరికాదని అభిప్రాయపడింది.