నా కుటుంబసభ్యులపై తీన్మార్‌ మల్లన్న అసత్య ఆరోపణలు

–  పరువు నష్టం దావా వేస్తా : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తన కుటుంబ సభ్యులపై తీన్మార్‌ మల్లన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారనీ, ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన సతీమణీ నీలిమ ఇంటర్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం పొందారని తెలిపారు. 1992లో ఆమె ప్రభుత్వ ఉద్యోగం సాధించారనీ, 2015లో డివిజనల్‌ ఇంజినీర్‌గా పదోన్నతిలోకి వచ్చిందని తెలిపారు. ఆరు నెలలు డిప్యూటేషన్‌పై సచివాలయంలో పని చేసి 2020 నవంబర్‌ 19 వీఆర్‌ఎస్‌ తీసుకున్న నీలిమ వామపక్ష విద్యార్థి సంఘం నాయకురాలిగా కూడా పని చేశారని గుర్తుచేశారు.
అనురాగ్‌ విద్యాసంస్థల్లో ప్రతి నెల ఐదున జీతాలు ఇస్తున్నట్టు పల్లా ఈ సందర్భంగా తెలిపారు. ప్రజావాణీలో తీన్మార్‌ మల్లన్నపై ప్రజలు ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మల్లన్న సోదరుడు, ఇంటిలిజెన్స్‌ అధికారులు తమ విద్యాసంస్థలకు వచ్చిన బెదిరిస్తున్నారని ఆరోపించారు. జనగామలో తనపై ఓడిన అభ్యర్థి ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నాడని తెలిపారు.
ఆటోడ్రైవర్లకు నెలకు రూ.15 వేలు జీవనభృతి : మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌
ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15 వేలు జీవనభృతి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రజా పాలన మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలన్నారు. ఆర్టీసీ సర్వీసులను తగ్గించడం సరికాదని విమర్శించారు. ఇంటలిజెన్స్‌ అధికారులు ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారనీ, గోదావరి పరివాహక ప్రాంత నేతలకు ప్రాణ హానీ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తను హత్య చేశారని వివరించారు. తుంగతుర్తిలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తతో పాటు ఆయన భార్యపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు.