– ముగిసిన మేడారం మహా జాతర ఘట్టం
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క – సారలమ్మ పూజారులు బుధ వారం తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించారు. దాంతో మేడారం మహాజాతర ఘట్టం పూర్తిగా ముగిసినట్టు పూజారులు ప్రకటించారు. ఆదివాసీ పూజారులు దేవాలయాలను శుద్దిచేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వాటికి తాళాలు వేశారు. కాగా తిరుగువారం సందర్భంగా మేడారంలో భక్తుల రద్దీ నెలకొంది. జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క వన ప్రవేశంతో జాతర శనివారం పరిసమాప్తమైంది. మేడారం గద్దెపై నుంచి చిలకలగుట్టకు సమ్మక్క చేరుకుంది. కన్నెపల్లికి సారలమ్మ, పూనుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజు పయనమయ్యారు. వన దేవతలు గద్దెలు విడిచే సమయంలో మేడారంలో వర్షం కురవడం విశేషం. వర్షాన్ని శుభ సూచకంగా భావించిన భక్తులు జయజయ ధ్వానాలు చేస్తూ అమ్మలకు ఘనంగా వీడ్కోలు పలికారు. తిరుగువారం మేడారం జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకుని, నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు.