
తిరుమలగిరి మున్సిపాలిటీని సూర్యాపేట జిల్లాలోనే మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అవిశ్వాస తీర్మానం నెగ్గిన అనంతరం కౌన్సిలర్లతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీల అన్నిట్లోనూ తిరుమలగిరిని ప్రత్యేకంగా అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయించి మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక చొరవ చూపెడతానని చెప్పారు. గత ప్రభుత్వంలో తిరుమలగిరి మున్సిపాలిటీ తోపాటు మండలం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆయన అన్నారు. మున్సిపాలిటీలకు నిధులు లేక నీరసించిపోయిందని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వమని ప్రజలతోపాటు గ్రామ,మండల మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి నిధులు మంజూరు చేయిస్తానని ఆయన చెప్పారు. తమది ప్రజాపాలన ప్రభుత్వమని ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని ఆయన చెప్పారు.తాను తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కౌన్సిలర్లే గత పాలకవర్గం ఒంటెద్దు పోకడ అవినీతి పాలన మూలంగా విసిగి వేసారి పోయి వారే కడుపు మండి అవిశ్వాస తీర్మానం పెట్టారు తప్ప అందులో తమ ప్రమేయంతో పాటు ఎవ్వరిని ఒత్తిడికి గురి చేయలేదని ఆయన చెప్పారు.ఇకనైనా ఒత్తిడికి గురి చేసినట్లు ఆరోపణలు చేస్తే సహించేలేదని చెప్పారు. ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిలర్ తోపాటు అధికారులకు సిబ్బందికి స్వేచ్ఛ లభించిందని ఆయన చెప్పారు. మున్సిపల్ చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికి విజయం సాధించిన కౌన్సిలర్లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లుఎల్సో జ్ నరేష్ మొగుళ్ళ జితేందర్ బత్తుల శ్రీనివాస్, చాగంటి అనసూయ రాములు కుదురుపాక శ్రీలత రాములు. పత్తెపరం సరిత నాగార్జున కేసిడి సరళ యాదవ రెడ్డి కన్నెబోయిన రేణుక లక్ష్మయ్య చిరబోయిన హనుమంతు ,గిలకత్తుల ప్రియలతా రాముగౌడ్, పొన్నం రాజ్యలక్ష్మి , భాస్కర్ నాయక్ తోపాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.