– 89 పరుగులకే గుజరాత్ ఆలౌట్
– 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం
నవతెలంగాణ-అహ్మదాబాద్
ఢిల్లీ క్యాపిటల్స్ అదరహో. గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన పంత్‌సేన కీలక సమయంలో భారీ విజయం సాధించింది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల దెబ్బకు గుజరాత్ టైటాన్స్ ఢమాల్ అయ్యింది. సొంతమైదానంలో ఆ జట్టు 89 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఇదే అత్యల్ప స్కోరు. పేసర్లు ముకేశ్ కుమార్ (3/14), ఇషాంత్ శర్మ (2/8), స్పిన్నర్ ట్రిస్టన్ స్టబ్స్ (2/11) విజృంభించటంతో అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 17.3 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. టెయిలెండర్ రషీద్ ఖాన్ (31, 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) గుజరాత్ టైటాన్స్‌కు ఆ మాత్రం స్కోరు అందించాడు. 90 పరుగుల ఛేదనలో కెప్టెన్ రిషబ్ పంత్ (16 నాటౌట్, 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), జేక్ ఫ్రేసర్ (20, 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిషేక్ పోరెల్ (15, 7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), షారు హోప్ (19, 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. 8.5 ఓవర్లలోనే (మరో 67 బంతులు ఉండగానే) 92 పరుగులు బాదిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది ఏడు మ్యాచుల్లో మూడో విజయం కాగా.. గుజరాత్ టైటాన్స్‌కు ఏడు మ్యాచుల్లో ఇది నాల్గో పరాజయం.
పేసర్ల ప్రతాపం : తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌కు ఢిల్లీ పేసర్లు చుక్కలు చూపించారు. ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్‌లు నిప్పులు చెరిగే బంతులు సంధించారు. వృద్దిమాన్ సాహా (2), శుభ్‌మన్ గిల్ (8), సాయి సుదర్శన్ (12), డెవిడ్ మిల్లర్ (2), అభినవ్ మనోహర్ (8), రాహుల్ తెవాటియ (10), షారుక్ ఖాన్ (0) పది ఓవర్లలోపే డగౌట్‌కు చేరుకు న్నారు. 48/6తో గుజరాత్ టైటాన్స్ మరింత స్వల్ప స్కోరుకు పరిమితం అయ్యేలా కనిపించింది. రషీద్ ఖాన్ (31) ఎదురుదాడి ఇన్నింగ్స్‌తో టైటాన్స్ ఆ మాత్రం స్కోరు అందిం చాడు. మోహిత్ శర్మ (2), నూర్ అహ్మద్ (1) సైతం నిరాశపరిచారు. 17.3 ఓవర్లలోనే గుజరాత్ టైటాన్స్ పది వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్ సహా స్పిన్నర్ ట్రిస్టన్ స్టబ్స్ వికెట్ల వేటలో మెరిశారు. ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.