రాయల్స్‌కు టైటాన్స్‌ పంచ్‌

రాయల్స్‌కు టైటాన్స్‌ పంచ్‌– ఛేదనలో మెరిసిన గిల్‌, రషీద్‌ ఖాన్‌
– రాజస్థాన్‌ 196/3, గుజరాత్‌ 199/7
నవతెలంగాణ-జైపూర్‌ :
ఐపీఎల్‌ 17లో రాజస్థాన్‌ రాయల్స్‌కు తొలి ఓటమి. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్‌ టైటాన్స్‌ ఛేదించింది. శుభ్‌మన్‌ గిల్‌ (72, 44 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), సాయి సుదర్శన్‌ (35) సహా రాహుల్‌ తెవాటియ (22), రషీద్‌ ఖాన్‌ (24 నాటౌట్‌) రాణించటంతో టైటాన్స్‌ 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఖరు 12 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన తరుణంలో రషీద్‌ ఖాన్‌, రాహుల్‌ తెవాటియ చెలరేగారు. రషీద్‌ ఖాన్‌ దూకుడుకు కుల్దీప్‌ సేన్‌, అవేశ్‌ ఖాన్‌లు తేలిపోయారు. ఆఖరు బంతికి బౌండరీ బాదిన రషీద్‌ ఖాన్‌ తనదైన శైలిలో గుజరాత్‌ టైటాన్స్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. తొలుత సంజు శాంసన్‌ (68 నాటౌట్‌, 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), రియాన్‌ పరాగ్‌ (76, 48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో మెరవటంతో రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఐదు మ్యాచుల్లో రాజస్థాన్‌ రాయల్స్‌కు తొలి ఓటమి కాగా.. గుజరాత్‌ టైటాన్స్‌కు ఆరు మ్యాచుల్లో మూడో విజయం.