శీర్షికేల…?

Title...?సమాజమా!
అగ్నికణమై అత్యాచారంపై
దిగ్గున లేవాల్సిన చోట
బొగ్గు సుద్దలా పడి ఉన్నందుకు
ఎక్కడా సిగ్గనిపించడం లేదా?
ఒళ్ళంతా ఛిద్రమై కాళ్ళనిండా రక్తంతో
సాయమో అన్నలారా అని అర్థిస్తుంటే …
ఓ గుడ్డపాత ఒంటికి చుట్టలేని
అశక్తతను నింపుకున్న
మీ పుర్రెలు ఎందుకు భళ్ళున
ఫొటోల వాంతి చేసుకున్నాయో?
సంస్కారం దారి తప్పి
సిగ్గుమాలిన సంచారం చేస్తున్నాయో?
ప్రశ్నల శరాలు మీ ఒంటిని గుచ్చలేదా?
మీ రక్తమెట్ల ఉడకలేదు? శౌర్యమెట్ల లేవలేదు?

కుళ్ళిన ఈ సమాజాన్ని ఏ నాడూ యాచించకమ్మ
జీవశ్ఛవమైన చైతన్యం వైపు జాలిగా చూడకమ్మ
వీలైతే ఓ ఛర్నాకోల ధరించి దాన్ని చరిచి లేపు
చీము పట్టిన సమాజాన్ని ఎదిరించి కుదుపు
మీ తల్లి చెల్లి తలపుకు రాలేదా అని నిగ్గదిరు
చలనంలేని చట్టాలు చేయడం
గొట్టాలు చాచడమే కాదు
ఒక్క చేతికి వంద చేతులు కలిపి నిలిపే
చైతన్యం నింపే ప్రవాహానికి మళ్ళీంచే దెపుడు
మనుషులుగా ఈ సమాజాన్ని నడిపే పాలనేదిని
నిగ్గదీయ దిగ్గున లేచిన చైతన్యమై చరించు
నా నీ మన గొంతులుగా
ఏకమై లెగుస్తొయేమో చూద్దాం
మనుషుల మనుషులుగా లేపే ప్రయత్నం చేద్దాం.
(మధ్యప్రదేశ్‌ – ఉజ్జయినిలో 12ఏళ్ల మైనర్‌
బాలికపై అత్యాచారం ఘటనను నిరసిస్తూ…)
– ఉన్నం వెంకటేశ్వర్లు, 8790068814