నవతెలంగాణ-అడవిదేవులపల్లి
అటవీ భూమి సాగులో ఉన్న ప్రతి రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోర్ర శంకర్‌నాయక్ అన్నారు. శనివారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ భూములు హక్కు పత్రాలు ఇస్తామని సర్వే చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పాస్ బుక్కులు ఇవ్వడం లేదన్నారు. అటవీ సాగు భూములు ఒక రైతుకు రెండు మూడు చోట్ల 10 ఎకరాలు మించకుండా ఉంటే ఆ భూములకు కూడా పట్టాలివ్వాలన్నారు. అటవీ భూములో పట్టా ఉన్న రైతులకు బోరు, కరెంట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉల్సాయపాలెం గ్రామపంచాయతీ తాటి చెట్టు తండా గాంధీనగర్ తండా గిరిజన రైతుల భూములు గతంలో రెవిన్యూగా ఇప్పుడు ఫారెస్ట్ గా ఉన్నదని ఆ రైతులకు రెవెన్యూ బుక్కులు రాకుండా చేశారని ఆరోపించారు. రెవెన్యూ ఫారెస్ట్ జాయింట్ సర్వే నిర్వహించి ఆ భూమి లెక్కలు తేల్చాలని తెలిపారు. అటవీ భూముల రైతులకు కొత్త అటవీ పాసుబుక్కులు రావడానికి సీపీఐ(ఎం), గిరిజన సంఘాల పోరాట ఫలితమే అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జటంగి సైదులు, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి కోర్ర సైదా నాయక్, గిరిజన సంఘం మండల నాయకులు రమావత్ హనుమంతు నాయక్, సర్వయ్య, తదితరులు పాల్గొన్నారు.