– తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోరాటాల ఫలితంగానే పోడు భూములకు హక్కు పత్రాలు వచ్చాయని తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుదీర్ఘకాలం గిరిజనులు, గిరిజన సంఘాలు, వామపక్ష పార్టీలు చేసిన పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం 4 లక్షల ఎకరాల పై హక్కు పత్రాలను ఇస్తున్నదని గుర్తుచేశారు. పోడు పోరాటంలో గిరిజనులు, గిరిజన సంఘాలు నాయకులపై పెట్టిన కేసులు అన్నిటిని ఎత్తేయాలని ఆసిఫాబాద్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చీఫ్ సెక్రటరీని ఆదేశించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గిరిజనులు, ఇతర పేదలు రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల్లో పోడు భూములను సాగు చేస్తున్నారని తెలిపారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం వారందరికీ హక్కులు కల్పించాలని తొమ్మిదే ండ్లుగా గిరిజనులు, గిరిజన సంఘాలు, వామపక్ష పార్టీలు పోరాటాలు నిర్వహించాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీవ్ర నిర్బందాన్ని ప్రయో గించిందని తెలిపారు. వేలాది మందిపై అక్రమ కేసులు పెట్టిందనీ, వందలాదిమంది జైళ్లకు వెళ్లారని గుర్తుచేశారు. ఇప్పటికీ అనేకమంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఆ పోరాటాల ఫలితంగానే సీఎం కేసీఆర్ గత అసెంబ్లీ సమావేశా ల సందర్భంగా 11.50 లక్షల ఎకరాలపై హక్కులు కల్పిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. కానీ కేవలం 4 లక్షల ఎకరాలపై, 1 లక్ష 51 వేల మంది గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు. మరో 7.50 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా నిరాకరించ డమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం అట్టహాసంగా పంపిణీ చేస్తున్న పోడు హక్కు పత్రాలు అన్ని జిల్లాల్లో సమాంతరంగా పంపిణీ చేయకపోవడం వలన లబ్ధిదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నదని తెలిపారు. మరో వైపు ముఖ్యమంత్రి ,మంత్రులు పోడు భూముల పంపిణీకి జిల్లాలకు వెళ్లిన సందర్భంగా అనేక మంది గిరిజన సంఘం, గిరిజన సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం, గహనిర్బంధం విధించడమేంటని ప్రశ్నించారు. గిరిజనులు, పేదల దరఖాస్తులను తిరస్కరించిన వాటన్నిటిని తిరిగి పరిశీలించి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.