– రంజీ ట్రోఫీ విజేతగా అవతరణ
– టైటిల్ పోరులో విదర్భ ఓటమి
ముంబయి సాధించింది. 8 ఏండ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరదించింది. రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచి దేశవాళీ క్రికెట్లో మళ్లీ అగ్ర జట్టుగా అవతరించింది. ఉత్కంఠగా సాగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ పోరాట పటిమ చూపినా.. పరాజయం తప్పలేదు. 538 పరుగుల రికార్డు ఛేదనలో విదర్భ 368 పరుగులే చేసింది. 169 పరుగుల తేడాతో ముంబయివిజేతగా నిలిచింది. ముంబయికి ఇది 42వ రంజీ ట్రోఫీ విజయం కావటం విశేషం.
నవతెలంగాణ-ముంబయి
రంజీ ట్రోఫీ ముంబయిదే. ఉత్కంఠ రేపుతూ ఐదో రోజుకు దారితీసిన టైటిల్ పోరులో ఆతిథ్య ముంబయి వాంఖడేలో అదిరే విజయం సాధించింది. విదర్భపై 169 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఎనిమిదేండ్లుగా రంజీ ట్రోఫీకి దూరమైన ముంబయి.. ఎట్టకేలకు ఈ ఏడాదిలో టైటిల్ ముద్దాడింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ లేకుండానే ముంబయి ఈ ఘనత సాధించింది. రికార్డు 538 పరుగుల ఛేదనలో విదర్భ 368 పరుగులకు కుప్పకూలింది. విదర్భ కెప్టెన్ అక్షరు వాడ్కర్ (102, 199 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) అసమాన శతకంతో పోరాడినా ప్రయోజనం దక్కలేదు. కరుణ్ నాయర్ (74, 220 బంతుల్లో 3 ఫోర్లు), హర్ష్ దూబె (65, 128 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించారు. 134.3 ఓవర్లలో 368 పరుగులకు ఆలౌటైన విదర్భ.. 169 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. టైటిల్ పోరులో ముంబయికి తలొంచి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ముంబయి యువ బ్యాటర్ ముషీర్ ఖాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలువగా.. ఆ జట్టు పేస్ ఆల్‌రౌండర్ తనుశ్ కొటియన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.
అక్షరు పోరాడినా..
విదర్భ లక్ష్యం 538 పరుగులు. తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగుల లోటు. 105 పరుగులకే కుప్పకూలిన దీన స్థితి. ఈ పరిస్థితుల్లో చివరి రెండు రోజుల్లో విదర్భ పోరాట స్ఫూర్తి చూపిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ విదర్భ గొప్ప ప్రదర్శన చేసింది. రంజీ ట్రోఫీ ఫైనల్‌కు వన్నె తీసుకొచ్చింది. ఓవర్‌నైట్ స్కోరు 248/5తో ఐదో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన విదర్భ.. మరో 120 పరుగులు జోడించింది. కానీ స్పెషలిస్ట్ బ్యాటర్లు అందరూ నాల్గో రోజే పెవిలియన్‌కు చేరటంతో టెయిలెండర్లతో లక్ష్యం చేరేందుకు కుదరలేదు. అక్షరు వాడ్కర్ (102) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో విదర్భ ఛేదనను ముందుండి నడిపించాడు. నాల్గో రోజు ఆటలో కరుణ్ నాయర్ పోరాడగా.. ఐదో రోజు అక్షరు ఆ పని చేశాడు. హర్ష్ దూబె (65) అర్థ సెంచరీతో కదం తొక్కాడు. కరుణ్ నాయర్, అక్షరు జోడీ 173 బంతుల్లో 90 పరుగులు జోడించగా… అక్షరు, హర్ష్ దూబెలు 255 బంతుల్లో 130 పరుగులు జత చేశారు. ఈ రెండు భాగస్వామ్యాలతో విదర్భ శిబిరంలో ఆశలు చిగురించగా.. ఆ రెండు భాగస్వామ్యాల పతనంతో ఆశలూ ఆవిరయ్యాయి. టెయిలెండర్లలో ఎవరూ నిలబడే ప్రయత్నం చేయలేదు. ఆదిత్య (3), యశ్ ఠాకూర్ (6), ఉమేశ్ యాదవ్ (6), ఆదిత్య ఠాకరే (0) విఫలమయ్యారు. ఉమేశ్ యాదవ్ వికెట్‌ను గాల్లోకి గిరాటేసిన ధవళ్ కులకర్ణి ముంబయికి 42వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను కట్టబెట్టాడు.
భారీ ప్రైజ్‌మనీ
దేశవాళీ ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ విజేత భారీ నగదు బహుమతి అందుకుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు అగ్ర తాంబూలం ఇచ్చిన భారత క్రికెట్ బోర్డు.. దేశవాళీ క్రికెట్‌కు అదే రీతిలో సముచిత ప్రాధాన్యం ఇస్తోంది. రంజీ ట్రోఫీ చాంపియన్ ముంబయి టైటిల్‌తో పాటు రూ.5 కోట్ల ప్రైజ్‌మనీ సాధించగా.. రన్నరప్ విదర్భ రూ.3 కోట్ల నగదు బహుమతి దక్కించుకుంది.
స్కోరు వివరాలు
ముంబయి తొలి ఇన్నింగ్స్ : 224/10
విదర్భ తొలి ఇన్నింగ్స్ : 105/10
ముంబయి రెండో ఇన్నింగ్స్ : 418/10
విదర్భ రెండో ఇన్నింగ్స్ : 368/10