టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్‌ వీఆర్‌ఎస్‌!

TNGO President Rajender VRS!– ప్రభుత్వానికి దరఖాస్తు
– సోమవారం ఆమోదించే అవకాశం
– త్వరలో బీఆర్‌ఎస్‌లోకి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ (టీఎన్జీవో) అసోసియేషన్‌ కేంద్ర సంఘం అధ్యక్షులు మామిళ్ల రాజేందర్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. స్వచ్చంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్‌) కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన దరఖాస్తు చేశారు. సోమవారం ఆయన దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించే అవకాశమున్నది. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన రాజేందర్‌ సంగారెడ్డి వాస్తవ్యులు. ముదిరాజ్‌ సామాజిక వర్గంలో ఆయన జన్మించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా టీఎన్జీవో కార్యదర్శిగా, అధ్యక్షునిగా రెండు పర్యాయాలు పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండుసార్లు సేవలందించారు. ప్రస్తుతం ఆయన అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కృషి చేశారు. 11వ పీఆర్సీలో 43 శాతం, తెలంగాణ మొదటి పీఆర్సీలో 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడంలోనూ తన వంతు పాత్ర నిర్వహిం చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత నాణ్యమైన వైద్య చికిత్స అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కొత్త ఆరోగ్య పథకం తీసుకురావడంలోనూ తనదైన పాత్ర పోషించారు. అసెంబ్లీ స్థానాల్లో ముదిరాజ్‌లకు తక్కువ సీట్లు కేటాయించారన్న వాదన బలంగా వినిపిస్తున్నది. రాజేందర్‌ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయడం వెనుక ఇదే బలమైన కారణంగా ఉందని తెలుస్తున్నది. అయితే ఆయనకు సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ లేదంటే ఎన్నికలయ్యాక ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టే అవకాశమున్నట్టు సమాచారం.
సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకే వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసినట్టు రాజేందర్‌ నవతెలంగాణకు చెప్పారు. వీఆర్‌ఎస్‌కు ప్రభుత్వం ఆమోదం తెలపగానే త్వరలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరబోతున్నట్టు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా, ఏ పదవి కట్టబెట్టినా నిర్వహిస్తానని అన్నారు.