”అభి … ఒకసారి ఇటు వస్తావా” పిలుస్తోంది సురేఖ. ఒక్కసారి కాదు ఇప్పటికి నాలుగు సార్లు పిలిచింది. అయినా సెంటీమీటర్ కూడా ముఖం పక్కకు తిప్పలేదు. అసలు వినిపించిందో లేదో కూడా తెలీదు. ”ఒరేరు అభిజిత్… ఎన్ని సార్లు పిలవాల్రా నిన్ను” అంటూ ఈసారి పెద్దగా అరుస్తూ దగ్గరికెళ్ళి చెవులకు పెట్టుకున్న ఇయర్ బడ్స్ తీసి మూలకి విసిరేసింది. ”ఏంటమ్మా మంచి వెబ్ సిరీస్ చూస్తుంటే డిస్ట్రబ్ చేస్తావ్. రా… రా… నువ్వు కూడా చూద్దూగాని. భలేవుంది మా, ఫ్యామిలీ డ్రామా” అంటూ ఇంకా ఏదో చెప్తూనే వున్నాడు. అసలే కోపంలో వున్న సురేఖకి అరికాలి మంట నెత్తికెక్కింది. ”నేను ఆఫీస్ కాల్‌లో వున్నాను, స్టౌమీద పాలు పెట్టాను, చూస్తుండమని చెప్పా కదా. పాలు పొంగి స్టౌ అంతా పాడైపోయింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని క్లీన్ చెయ్యాలి. అలా ఆ ఫోన్‌లో తలపెట్టుకు కూర్చున్నావ్. రెండు గంటల నుండి చూస్తున్నా, పెట్టిన అన్నం ప్లేటు కూడా ఖాళీ అవలేదు. నీకు తిండీ, నీళ్ళు ఏమీ అవసరం లేదు. ఏమన్నా అంటే.. ఇంట్లో ఫుడ్ బాలేదంటూ ఆర్డర్లు పెట్టుకోవడం బాగా అలవాటైపోయింది. ఏం పిల్లల్రా బాబూ! ఇంట్లో అందరికందరూ సరిపోయారు. నిన్ను చూడబోతే 24 గంటలూ ఆ సెల్‌ఫోన్‌కి అత్తుకుపోతావు. మీ నాన్నా అంతే… ఓ పక్క ఆఫీస్ వర్క్ చూసుకుంటూనే ఫోన్ కీ రెస్ట్ ఇవ్వరు. రెండూ ఒకే టైమ్‌లో ఎలా చేస్తున్నారో నాకైతే అర్ధం కావట్లేదు. నాకేమో ఇంటి పనులకి, ఆఫీస్ వర్క్‌కి టైం సరిపోవట్లేదు. మీకేమో మొబైల్ ఫోన్లు చూడ్డానికి టైం సరిపోవట్లేదు….” ఇంకా ఏదేదో చెప్పుకుంటూనే వుంది సురేఖ. కానీ అక్కడెవరూ లేరు. అభిజిత్ మళ్ళీ ఫోన్‌లోకి ముఖం పెట్టేశాడు. సురేఖ భర్త కూడా సెల్‌లో ఏదో చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. నేను సురేఖ ఇంటికి వెళ్ళేసరికి ఇదీ పరిస్థితి.
”ఏమిటి సురేఖా.. నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావ్. అరుస్తున్నావ్, కేకలేస్తున్నావ్. ఏమైంది ఇవ్వాళ నీకు?” అన్నానో లేదో… ”నీ కళ్ళకి కూడా నేనో పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా?” అంటూ నా మీద కయ్యిమని లేచింది. ”అదేం కాదులే గానీ, రా పనుంది. బయటికెళ్దాం” అని అభిజిత్‌కి, అత్తగారికి చెప్పి సురేఖని పది నిముషాల్లో బయటికి లాక్కెళ్లాను. ”ఏంటి సురేఖా.. సాటర్‌డే కూడా ఆఫీస్ వర్కా? ఆ లాప్‌టాప్‌ని నువ్వు వదిలిపెట్టవు గానీ, వాళ్ళని మాత్రం ఫోన్ పట్టుకోవద్దంటావ్” అన్నాను.
”నువ్వు కూడా వాళ్లలాగే అంటావేంటి అక్కా. ఏం తెలీనట్టు. నేనేమైనా కాలక్షేపానికి చేస్తున్నానా? ప్రాజెక్ట్ రిలీజ్ టైం అక్కా సపోర్టింగ్ రోల్‌లో వున్నప్పుడు, వర్క్‌కి టైమంటూ ఉండదు. రోజులో 18 గంటలు కూడా చేయాల్సి వస్తుంది ఈ మధ్య” అని తన ఆఫీస్ కష్టాలు చెప్తోంది.
కాలనీలోని పార్క్‌లో ఇద్దరం మాట్లాడుతూ వెళ్తుంటే.. ఇరవై ఏళ్లుంటాయేమో ఆ అమ్మాయికి, ”ఆగండాగండి… నేను చెప్పేది కాస్త వింటారా” అంటోంది ఆ పక్కనే బెంచి మీద కూర్చుని. మేం వెంటనే ఆగిపోయాం. ”ఏంటమ్మా…” అని అడిగింది సురేఖ. ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు సరికదా, మా వైపు కూడా చూడట్లేదు. ఎటో చూస్తోంది. సరే మమ్మల్ని కాదేమోననుకుని, మేం అడుగు ముందుకి వేయబోతుంటే, మళ్ళీ ఆ అమ్మాయే ”నేను చెప్పేది సరిగా విన్నారా, అసలు అర్ధం చేసుకోరేంటండీ” అని కాస్త కటువుగానే అంటోంది. మేమిద్దరం బిత్తరపోయాం. చుట్టూ చూశాం. ఆ దగ్గర్లో ఎవరూ లేరు మేం తప్ప. కనీసం ఫోన్‌లో మాట్లాడుతుందేమో అనుకుందామన్నా ఆ అమ్మాయి చేతిలో ఫోన్ కూడా లేదు. కాస్త కూడా మర్యాద లేకుండా తెలియని వాళ్ళని అలా అంటుందేంటి అనుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ”ఏంటమ్మా… అలా అంటున్నావు మమ్మల్ని” అన్నాను.
ఈ సారి ఆ అమ్మాయి బిత్తరపోయి చూస్తోంది మమ్మల్ని. ”మిమ్మల్ని నేనేం అన్నానండి? మీతో నేనసలు మాట్లడనే లేదు” అంది. ”మరి ఆగండి, సరిగా విన్నారా, అర్దం చేసుకోరేంటి అంటున్నావుగా” అన్నాను. ఆ అమ్మాయి నవ్వేసి, నేను ఫోన్‌లో మాట్లాడుతున్నానాంటీ. మీతో కాదు” అంది. అనుమానంగా చూశా ఆ అమ్మాయివైపు. ఎందుకంటే చేతిలో ఫోన్ కూడాలేదు మరి. ఆ విషయం ఆ అమ్మాయికి అర్ధమైందేమో… వస్తున్న నవ్వాపుకుంటూ ప్యాంట్ పాకెట్‌లో నుండి మొబైల్, చెవులకున్న ఇయర్ బడ్స్ తీసింది. వాటిని చూడగానే మాకూ నవ్వొచ్చింది. మామూలుగా సెల్ జేబులో పెట్టుకున్నా చెవుల్లో ఇయర్ ఫోన్స్ అయినా కనిపించేవి ఇంతకుముందు. ఇప్పుడొచ్చే ఇయర్ బడ్స్ అమ్మాయిలకైతే అసలు కనిపించట్లేదు, వాళ్ల జుట్టులో. ఆ అమ్మాయిది కూడా అప్పుడు లూజ్ హెయిర్ మరి.
ఈ సెల్ ఫోన్లతో ఉపయోగాలు, నష్టాలు పక్కన పెడితే ఇలాంటి సంఘటనలు నవ్వూ, కోపం రెండూ తెప్పిస్తాయి. సంఘటన జరిగిన సమయంలో కోపం రాకపోయినా కొంచెం ఎంబరాసింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎదుటివాళ్లు ఇది కూడా తెలీదా అన్నట్టు చూస్తారేమోనని. కానీ తర్వాత తలచుకుంటే నవ్వొస్తుంది. అయితే ఒక్క విషయం.. ఏ వస్తువైనా మితంగా, అవసరానికి వాడితేనే ఉపయోగం. అతిగా వాడితే అనర్థమే. ముఖ్యంగా స్టూడెంట్స్…. వాళ్ళు చదువుకునే సమయం కంటే సెల్‌ఫోన్ చూసే టైమే ఎక్కువ. ఇది అందరూ కాదనలేని వాస్తవం. ఇలాంటి సంఘటనలు ప్రతి తల్లిదండ్రులకు ఎదురయ్యేవే. పెద్దవాళ్లు చెప్తే పిల్లలు వినే పరిస్థితి లేదిప్పుడు. పిల్లలు వినగలిగేలా చెప్పడమే పెద్దవాళ్ళు చెయ్యాల్సిన పని. కాదంటారా!?
– బి. మల్లేశ్వరి