పార్లమెంటులో ప్రశ్నించాలంటే..

To be questioned in Parliament..– గులాబీ జెండా ఎగరాలి
– దాడులకు భయపడేది లేదు
– ఇటుకలతో దాడి చేస్తే.. రాళ్లతో ప్రతిఘటిస్తాం
– నాయకులు, కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దు: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవ తెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి /అచ్చంపేట
తెలంగాణ నిధులపై పార్లమెంటులో ప్రశ్నించాలంటే రాష్ట్రంలోని పార్లమెంటు నియోజకవర్గాలన్నింటిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించుకోవాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నాగర్‌ కర్నూల్‌, అచ్చంపేట నియోజకవర్గాల విస్తృతస్థాయి సమా వేశాలను నిర్వహించారు. ఆయా సమావేశాల్లో కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారం ఉంది కదాని విర్రవీగుతూ ఇటుకలతో దాడి చేస్తోందని, దానిని మేము ప్రతిఘటిస్తామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అనుకోకుండా అధికారంలోకి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా
పార్లమెంటులో ప్రశ్నించాలంటే.. గులాబీ జెండా ఎగరాలి రేవంత్‌ రెడ్డిని ప్రకటించి ఉంటే… కచ్చితంగా నూటికి నూరుపాళ్ళు కాంగ్రెస్‌ ఓటమి చెందేదని గుర్తు చేశారు. సాధ్యం కానీ గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చారన్నారు. ఇప్పుడు ఆ ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. కుటుంబంలో ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చెల్లిస్తామని చెప్పారని, దీనికోసం రాష్ట్రంలో 1.65 కోట్ల మంది మహిళలు ఎదురుచూస్తున్నారని అన్నారు. అలాగే, రూ.500కే సిలిండర్‌ కోసం 1.24కోట్ల మంది, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ కోసం 1.34 కోట్ల మంది ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఈ పథకాలు అమలు చేయడానికి అనేక కొర్రీలు పెడుతూ పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వేసవి ప్రారంభంలోనే తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మిషన్‌ భగీరథ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీజేపీ జాతీయహౌదా ఇవ్వలేదన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యల పరిష్కారానికి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీకి పట్టంకట్టేలా ప్రజలకు అవగాహన కల్పించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. ఓడిపోయినా ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల పైన పోరాటాలు చేస్తూనే ఉంటానని తెలిపారు. నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొస్తే దాన్ని రద్దు చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ కుట్రలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.