జోరు సాగాలని..!

Go ahead..!– బంగ్లాతో భారత్‌ ఢీ నేడు
– నాల్గో విజయంపై రోహిత్‌సేన గురి
– సంచలనంపై బంగ్లాదేశ్‌ ఆశలు
– మ|| 2 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ప్రపంచకప్‌ సంచలనాలకు చిరునామాగా మారింది. డిఫెండింగ్‌ చాంప్స్‌కు అఫ్గాన్‌, సఫారీలకు డచ్‌ షాక్‌ ఇవ్వగా.. ఆస్ట్రేలియా మునుపటిలా ఆడటం లేదు. పాకిస్థాన్‌ సైతం పసలేని ప్రదర్శన చేస్తోంది. అగ్ర జట్లలో, టైటిల్‌ ఫేవరేట్లలో టీమ్‌ ఇండియా మాత్రమే అంచనాలను అందుకుంటూ దూసుకెళ్తోంది.
హ్యాట్రిక్‌ విజయాల జోరుమీదున్న రోహిత్‌సేన నేడు పుణెలో బంగ్లాదేశ్‌ను బాదేసి నాల్గో విజయం ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది. అఫ్గాన్‌, నెదర్లాండ్స్‌ స్ఫూర్తితో మరో సంచలనంపై బంగ్లాదేశ్‌ సైతం ఆశలు పెట్టుకుంది. ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో భారత్‌, బంగ్లాదేశ్‌ పోరు నేడు.
నవతెలంగాణ-పుణె
ఐసీసీ ప్రపంచకప్‌లో ఆతిథ్య టీమ్‌ ఇండియా మరో సవాల్‌కు సిద్ధమైంది. పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో ఢకొీట్టేందుకు భారత్‌ రంగం సిద్ధం చేసుకుంది. హ్యాట్రిక్‌ విజయాల ఊపు మీదున్న టీమ్‌ ఇండియా నాల్గో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. 25 ఏండ్ల తర్వాత సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో వన్డే ఆడుతున్న టీమ్‌ ఇండియాకు.. బంగ్లా ఇటీవల రికార్డు కాస్త కలవరమే. గత 12 నెలల్లో జరిగిన నాలుగు వన్డేల్లో బంగ్లాదేశ్‌ 3-1తో ముందంజలో నిలిచింది. ఇటీవల ఆసియా కప్‌ సూపర్‌4లో సైతం భారత్‌పై బంగ్లాదేశ్‌ పైచేయి సాధించింది. ఆ ఉత్సాహంతోనే నేడు మెగా మ్యాచ్‌కు బంగ్లాదేశ్‌ సిద్దమవుతోంది.
రోహిత్‌సేనకు ఎదురుందా?
ఆతిథ్య జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాట్‌తో ఫామ్‌లోకి రావటం భారత్‌కు అతిపెద్ద అనుకూలత. భారత బ్యాటర్లు మెరవటంతో గత మూడు మ్యాచుల్లో కలిపి 9 వికెట్లే భారత్‌ కోల్పోయింది. ఏ మ్యాచ్‌లోనూ నాలుగు వికెట్లకు మించి చేజార్చుకోలేదు. టాప్‌ ఆర్డర్‌లో నిలకడలేమి ప్రదర్శనలు ఉన్నప్పటికీ.. ఓవరాల్‌గా గొప్పగా కనిపిస్తుంది. బంగ్లాదేశ్‌పై తిరగులేని రికార్డున్న విరాట్‌ కోహ్లి నేడు పుణెలోనూ మెగా ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌, విరాట్‌లు మెరిస్తే బంగ్లా బౌలర్లకు తిప్పలు తప్పవు. చివరగా పుణెలో జరిగిన మ్యాచ్‌లో కెఎల్‌ రాహుల్‌ సెంచరీ సాధించాడు. ఇప్పుడు రాహుల్‌ జోరుమీద కనిపిస్తున్నాడు. అదే ప్రదర్శన పునరావృతం చేయాలనే ఆరాటం కనిపిస్తుంది. శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్యలు భారత్‌కు కీలకం కానున్నారు. పరుగుల పిచ్‌పై అశ్విన్‌ మరోసారి బెంచ్‌కు పరిమితం కానుండగా.. శార్దుల్‌ ఠాకూర్‌ తుది జట్టులో నిలువనున్నాడు. కుల్దీప్‌ యాదవ్‌తో కలిసి రవీంద్ర జడేజా స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు. కుల్దీప్‌ యాదవ్‌ మూడు మ్యాచుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. 30 ఓవర్లలో ఎకానమీ 3.9 మాత్రమే. మిడిల్‌ ఓవర్లలో కుల్దీప్‌ను కాచుకోవటం బంగ్లాదేశ్‌కు శక్తికి మించి పని కానుంది. జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌లు స్పెషలిస్ట్‌ పేసర్లు సత్తా చాటనున్నారు.
అద్భుతంపై ఆశతో..
ప్రపంచకప్‌లో వరుసగా సంచలనాలు నమోదవుతున్నాయి. దీంతో బంగ్లాదేశ్‌ సైతం ఓ అద్భుతంపై కన్నేసింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. కీలక ఆటగాళ్లు సైతం నిలకడగా ఆడటం లేదు. ముష్ఫీకర్‌ రెండు అర్థ సెంచరీలు సాధించినా.. ఇతర బ్యాటర్లు విఫలమవుతున్నారు. హృదరు, మెహిది హసన్‌, ఓపెనర్‌ హసన్‌లు స్థాయికి తగ్గ ఆట ఆడటం లేదు. బంతితోనూ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ మినహా ఎవరూ ఆకట్టుకోవటం లేదు. దీంతో నేటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పెద్దగా అంచనాలు లేవు. బ్యాట్‌తో లిటన్‌ దాస్‌, ముష్ఫీకర్‌, నజ్ముల్‌, షకిబ్‌ మెరిస్తే భారత్‌కు గట్టి పోటీ ఇవ్వవచ్చు. ముస్తాఫిజుర్‌ రెహమాన్‌కు స్పిన్నర్లు మెహిది, షకిబ్‌ తోడైతే భారత బ్యాటర్ల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంటుంది.
పిచ్‌, వాతావరణం
2017 నుంచి పుణెలో జరిగిన వన్డేల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు ఐదింట మూడు సార్లు 300 పైచిలుకు పరుగులు సాధించాయి. గత తొమ్మిది నెలల్లో ఇక్కడ జరుగుతున్న తొలి వన్డే ఇదే. నేడు మ్యాచ్‌ ఆరంభానికి చిరు జల్లులతో కూడిన వర్షం కురిసేందుకు అవకాశం ఉంది. మ్యాచ్‌ సమయంలో ఎటువంటి వర్షం సూచనలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. చిన్న బౌండరీల మైదానంలో నేడు పరుగుల వర్షం లాంఛనమే.
తుది జట్లు (అంచనా)
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దుల్‌ ఠాకూర్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌.
బంగ్లాదేశ్‌ : హసన్‌, లిటన్‌ దాస్‌, నజ్ముల్‌ హొసేన్‌ శాంటో, షకిబ్‌ అల్‌ హసన్‌ (కెప్టెన్‌), తౌవిద్‌ హృదరు, ముష్ఫీకర్‌ రహీమ్‌ (వికెట్‌ కీపర్‌), మెహిది హసన్‌ మిరాజ్‌, మహ్మదుల్లా, టస్కిన్‌ అహ్మద్‌, షోరిఫుల్‌ ఇస్లాం, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌.
67.25
బంగ్లాదేశ్‌పై విరాట్‌ కోహ్లికి తిరుగులేని రికార్డుంది. బంగ్లాపై 15 వన్డేల్లో 101.25 స్ట్రయిక్‌రేట్‌తో 67.25 సగటు సాధించాడు. బంగ్లాదేశ్‌పై కోహ్లి నాలుగు శతకాలు బాదాడు.
25
భారత్‌, బంగ్లాదేశ్‌లు భారత్‌లో వన్డే మ్యాచ్‌ ఆడి 25 ఏండ్లు గడిచాయి. చివరగా ఈ రెండు జట్లు ముంబయి వాంఖడెలో 1998లో తలపడ్డాయి. ఆ తర్వాత భారత్‌ వేదికగా వన్డే ఫార్మాట్‌లో ఆడలేదు. ఇప్పుడు పుణెలో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ పాతికేండ్ల విరామానికి తెరదించనుంది.