రమణిగారూ! మీ అవేర్‌నెస్‌కి నిజంగా అభినందించాలి. మంచి అబ్జర్వేషన్. దీన్నే సిబ్లింగ్ రైవలరి అంటారు.
సహజంగా మొదటి పిల్లలు అనగానే ప్రతి ఒక్కళ్లకి అదొక కొత్త అనుభవం. అందుకని తల్లిదండ్రులు, ఇంట్లో వున్న మిగిలిన కుటుంబ సభ్యులు పసిదనం నుంచి వాళ్లని బాగా గారాబం చేస్తారు. వాళ్ల మీద ఎక్కువ అటెన్షన్ పెడతారు. వాళ్లు ఏ చిన్న పని చేసినా దాన్ని మెచ్చుకోవడం, దాని గురించే పదిసార్లు చెప్పుకోవడం చేస్తారు. అలాగే ప్రేమని కూడా ఎక్కువగానే ప్రదర్శిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇంట్లో ఆ బిడ్డే సెంట్రల్ ఎట్రాక్షన్ అవుతాడు.
ఆ బిడ్డకి ఊహ తెలిసినప్పటి నుంచి అదే వాతావరణంలో పెరగడం వల్ల అతనికి తెలిసిన ప్రపంచం అదే అవుతుంది.
ఆ తర్వాత వాళ్లకి తమ్ముడో, చెల్లో వచ్చాక ఇప్పటి దాకా కుటుంబ సభ్యులు అతని మీద చూపించిన అటెన్ష్‌న్, కేర్, ప్రేమ, పొగడ్తలు అన్నింటిలో కొంత భాగం కొత్తగా వచ్చిన బిడ్డకి వెళ్లిపోతాయి. అది ఆ పసి మనసుకి కొంచెం బాధ కలిగిస్తుంది. దానికి తోడు ఈ పెద్ద పిల్లలు పసిబిడ్డ దగ్గర కూర్చుని దేనితోనన్నా ఆడుకుంటున్నప్పుడో, పక్కనుంచి పరుగెడుతున్నప్పుడో… అంటే ఆ బిడ్డకి దగ్గరగా వచ్చినప్పుడల్లా పెద్దవాళ్లు ఖంగారుగా ‘చెల్లి దగ్గర ఆడకూడదు, చెల్లి దగ్గర పరుగెత్తకూడదు, చెల్లిని అలా గట్టిగా పట్టుకోకూడదు’ అంటూ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. చెల్లికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ తనని అందరూ దూరంగా నెట్టేస్తున్నారు అన్న భావన ఆ పసి మనసుని గాయపరుస్తుంది. అదెలా చెప్పాలో తెలీక మీరన్నట్టు ప్రతి దానికీ పేచీలు పెట్టడం, మొండికేయడం, చేతిలో వస్తువులను విసిరేయడం చేస్తుంటారు. అందరి అటెన్షన్ తన వైపుకి తిప్పుకోవడానికి కూడా వాళ్లు అలా చేస్తారు.
మీ పిల్లవాడిలో ఇలాంటి లక్షణాలు రాకుండా వుండాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్త్రతలు కొన్ని సూచిస్తాను…
చి మీరు ఇప్పటి నుండే అతనికి కొత్తగా రాబోయే బిడ్డ గురించి చెప్పాలి. ‘చెల్లి నీ కోసమే వస్తోంది. నీతో ఆడుకోడానికి వస్తోంది. చెల్లిని నువ్వు ఎలా చూస్తావు?’ అంటూ చెల్లి రాకలో అతని ఇంపార్టెన్స్ హైప్ చేస్తూ మాట్లాడండి.
చి రెండో బిడ్డ వచ్చాక వీలైనంత వరకు ఇంట్లో మీకు సహాయపడడానికి పెద్దవాళ్లు గానీ, హెల్పర్స్ గానీ వుండేట్లు చూసుకోండి. అలా అయితే పని వత్తిడి వల్ల కలిగే విసుగుని పెద్ద పిల్లవాడి మీద చూపించకుండా వుంటారు. లేకపోతే ఇద్దరినీ మేనేజ్ చేయడం కష్టమవుతుంది. ఎంత మీ భర్త సహాయం చేసినా కూడా.
చి అప్పుడప్పుడు పసిబిడ్డని మీరు చేత్తో పట్టుకుని పిల్లవాడి ఒళ్లో పడుకోబెట్టండి. టచ్ అనేది చాలా ఇంపార్టెంట్.
చి పిల్లాడు ఆటల్లో ఏమైనా వస్తువులు పసిబిడ్డ వైపు విసిరితే కంగారు పడకుండా కొంచెం బుజ్జగించి చెప్పండి. అది కూడా ‘నీ చెల్లికి దెబ్బ తగులుతుంది కదా! అప్పుడు నువ్వే ఫీల్ అవుతావు కదా!’ అంటూ చెప్పడం వల్ల అమ్మ తనకి ఇంపార్టెన్స్ ఇస్తోందని ఆ పసి మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది.
చి వీలైతే వారంలో రెండుసార్లన్నా అతనితో కలిసి బైటకి వెళ్లండి. అతను ఇష్టపడే బొమ్మలు గానీ, పుస్తకాలు గానీ కొనివ్వడం, అతనికి ఇష్టమైన ఫుడ్ తినిపించడం చేయాలి. ఇవన్నీ తల్లిగా మీరు చేస్తేనే అతనికి హ్యాపీగా వుంటుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన చెల్లో, తమ్ముడో ఎక్కువగా మీ పక్కన వుండడం, మీరు ఫీడ్ చేయడం వాళ్లు గమనిస్తుంటారు. ‘ఇంతకు ముందు ఆ సమయమంతా అమ్మ నాతోనే గడిపేది కదా’ అన్న భావన ఆ పిల్లల మనసులో వుంటుంది. మనం పసి పిల్లలే కదా, అంత ఆలోచన వాళ్లకి వుంటుందా అనుకుంటాం. కానీ పసివాళ్లకే ఆ గమనించే లక్షణం, కంపేర్ చేసుకోవడం వుంటాయి. మీకివన్నీ ఇప్పుడు కొంచెం కష్టం అనిపించినా ఆచరించగలిగితే ఆ పిల్లలిద్దరి మధ్య పెద్దయ్యాక కూడా ఒక చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. లేకపోతే పెద్దయ్యాక కూడా వాళ్ల మధ్య సిబ్లింగ్ రైవలరీ వుంటుంది. దాని వల్ల ఇద్దరూ ప్రతిక్షణం పోట్లాడుకోవడం, ఒకళ్ల మీద ఒకళ్లు ఎప్పుడూ కంప్లయింట్స్ చేసుకోవడం, తమ కన్నా ఎదుటివాళ్లనే మీరు (పేరెంట్స్) ఎక్కువ ప్రేమగా చూస్తున్నారనో, ఎక్కువ అటెన్షన్ పెడుతున్నారనో మీ మీద అలగడం లాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది.
రెండో బిడ్డ పుట్టిన తర్వాత పెద్ద పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది పేరెంటింగ్‌లో చాలా క్రిటికల్ ఫేస్ అనే చెప్పాలి.
– గోపాలుని అమ్మాజి, 7989695883
హ్యూమన్ సైకాలజిస్ట్,
ఫ్యామిలీ కౌన్సిలర్