రెగ్యులర్‌గా కొట్టాలని..!

To hit regularly..!– 250-260 స్కోర్లపై గౌతం గంభీర్‌
ఎక్కువ రిస్క్‌.. ఎక్కువ రివార్డ్‌!. టీమ్‌ ఇండియా అన్ని ఫార్మాట్లలో పాటిస్తున్న ఫార్ములా ఇదే. కానీ టీ20ల్లోనే ఇది ఎక్కువగా ప్రతిఫలాలను అందిస్తున్నట్టు కనిపిస్తుంది. యువ క్రికెటర్లతో కూడిన టీమ్‌ ఇండియా టీ20ల్లో నిలకడగా భారీ స్కోర్లు సాధించాలనే వ్యూహంతో ఉన్నామని చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ అన్నారు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను భారత్‌ 4-1తో సొంతం చేసుకుంది.
నవతెలంగాణ-ముంబయి
భయమెరుగని క్రికెట్‌తో దంచికొడుతున్న టీమ్‌ ఇండియా యువ క్రికెటర్లపై చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1తో దక్కించుకున్న అనంతరం గౌతం గంభీర్‌ మీడియాతో మాట్లాడాడు. ఇటీవలా ఆస్ట్రేలియా పర్యటనలో దారుణ పరాజయంతో స్వదేశానికి వచ్చిన గంభీర్‌.. పొట్టి ఫార్మాట్‌లోనూ విజయ పరంపర కొనసాగించాడు. ఇంగ్లాండ్‌తో చివరి రెండు టీ20ల్లో భారత్‌ సూపర్‌ ఎటాకింగ్‌తో మెప్పించింది. పుణెలో ఇంగ్లాండ్‌ పేసర్‌ సకిబ్‌ మహమూద్‌ ఒక్క ఓవర్లోనే మూడు వికెట్లతో దెబ్బకొట్టినా.. మనోళ్లు ఎదురుదాడి ఆపలేదు. దీంతో భారత్‌ 181/9 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ ఆ మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ముంబయిలోనూ అదే ప్రదర్శన పునరావృతం అయ్యింది. ఓ ఎండ్‌లో వికెట్లు పడినా.. అభిషేక్‌ శర్మ వెనక్కి తగ్గలేదు. దీంతో భారత్‌ టీ20ల్లోనే నాల్గో అత్యధిక స్కోరు 247/9 సాధించింది. ఇటువంటి భయమెరుగని బ్రాండ్‌ క్రికెట్‌తో రెచ్చిపోతున్న కుర్రాళ్లను గంభీర్‌ గొప్పగా ప్రశంసించాడు.
ఇలా ఆడాలనే ప్లాన్‌ :
‘ఇటువంటి టీ20 క్రికెట్‌నే మేము ఆడాలని అనుకుంటున్నాం. వికెట్లు పోతాయనే భయంతో ఆడాలని అనుకోవటం లేదు. ఎక్కువ రిస్క్‌, ఎక్కువ రివార్డ్‌ మా ఫార్ములా. ఈ ప్రణాళికను యువ క్రికెటర్లు బాగా అలవర్చుకున్నారు. టీ20 జట్టు అంటేనే భయమెరుగని, స్వార్థంలేని మంత్ర. గత ఆరు నెలలుగా టీమ్‌ ఇండియా ఈ ఫార్మాట్‌లో ఇది అద్భుతంగా అనుసరిస్తోంది. 250-260 పరుగులను నిలకడగా సాధించాలని అనుకుంటున్నాం. ఈ క్రమంలో 120-130 పరుగులకు కుప్పకూలే సందర్భాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాం. టీ20 ఫార్మాట్‌ క్రికెట్‌ అంటే ఇదే. ఎక్కువ రిస్క్‌ తీసుకోకుంటే.. పెద్ద విజయాలు సాధించలేము. భారత టీ20 జట్టు ఈ విషయంలో సరైన మార్గంలోనే నడుస్తోంది’ అని గౌతం గంభీర్‌ అన్నాడు.