– హైదరాబాద్‌కు అమిత్‌షా రాక
– కారు దిగేందుకు 15 మంది ఎమ్మెల్యేలు సిద్ధం
– 15 ఎంపీ స్థానాలు మా లక్ష్యం నేను పోటీలో లేను
– మంత్రివర్గ విస్తరణలో సీఎం నిర్ణయమే ఫైనల్ : ఇష్టాగోష్టిలో కాంగ్రెస్ నేత మధుయాష్కీగౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డిని బాధ్యతలను తప్పించేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్ ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని ఓ కేంద్రమంత్రి స్వయంగా తనకు చెప్పారని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కిషన్‌రెడ్డి మరోసారి గెలించేందుకే అసద్ బారు అంటూ ఎంఐఎం నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆయినా తమాపార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందనే ఉద్దేశంతో వలసలను ప్రోత్సహించడం లేదన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 15 సీట్లలో గెలుపే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మధు యాష్కీ విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయమే ఫైనల్ అన్నారు. అందులో అధిష్టానం జోక్యం ఉండబోదని చెప్పారు. ఎల్బీనగర్‌లో తనను ఓడించేందుకు కూడా కొంత మంది కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షపదవి కోసం రెడ్డి సామాజిక తరగతికి చెందిన నాయకులు పోటీ పడుతున్నారని వివరించారు. ఎన్నికల సమయంలో పాదయాత్ర చేయాలంటూ అధిష్టానం తనను ఆదేశించిందన్నారు. రేవంత్, భట్టితోపాటు తానూ చేస్తే మూడో వ్యక్తి అయ్యేవాడినని చెప్పారు. ముగ్గురం మూడు దిక్కులకు పోయినట్టు ఉండేదని చెప్పారు. ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలు ప్రపంచంలో మార్మోగాయి. ఆస్కార్ స్టేజ్ దాకా వెళ్లాయి. కానీ, ప్రపంచ సినీ ఇండిస్టీ రంగంలో హైదరాబాద్ పిక్చర్‌లోనే లేదు. గోవా ఫిలిమ్ ఫెస్టివల్ ఎప్పుడూ జరుగుతుంటుంది. ఒకప్పుడు హైదరాబాద్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుండే.. కానీ, ఇప్పుడది జరగట్లేదు. పూర్తిగా డెడ్ అయింది.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అక్రమాస్తులను రక్షించుకునేందుకే పార్టీలు మారుతున్నారని చెప్పారు. వారికి పార్టీలతో సంబంధం లేదని మధుయాష్కీ ఈసందర్భంగా వ్యాఖ్యానించారు.