పిల్లల స్కూల్ బ్యాగ్ అయినా, మన ఆఫీస్ బ్యాగ్ అయినా, త్వరగా మురికి పడతాయి. వాటిని ప్రతి వారం ఉతకడం కష్టమే. నీటిలో నానపెడితే కొన్ని బ్యాగులు పాడయిపోయే ప్రమాదముంది. అటువంటి పరిస్థితిలో, మురికిగా కనిపించే బ్యాగును ఉతకకుండానే శుభ్రం చేసేందుకు కొన్ని చిట్కాలను చూద్దాం. ఈ క్లీనింగ్ హ్యాక్‌ల గురించి తెలిస్తే బ్యాగులు శుభ్రపరచడం చాలా సులువు.
డిటర్జెంట్‌తో
మీ బ్యాగ్ పై మొండి మరక ఉంటే, బ్యాగు మరీ పాతదిలా కనిపిస్తుంది. దానిని సులువుగా తొలగించుకోవచ్చు. దీని కోసం, ఒక గిన్నెలో కొద్దిగా డిటర్జెంట్ లేదా సబ్బు ద్రావణాన్ని తీసుకోండి. ఇప్పుడు ఈ సబ్బు ద్రావణంలో స్పాంజిని ముంచి బాగా పిండేయాలి. ఆ స్పాంజితో బ్యాగ్ పై ఉన్న మొండి మరకలను బాగా రుద్ది తొలగించుకోవచ్చు. ఈ ట్రిక్‌తో మీ బ్యాగ్ పై ఉన్న మొండి మరకలు చాలా సులువుగా పోతాయి. మీరు బ్యాగును ఉతకాల్సిన అవసరం లేదు.
మురికి వాసన పోయేందుకు
బ్యాగును తరచూ శుభ్రం చేయకపోతే మురికి వాసన వస్తుంది. ఆ వాసన భరించడం కష్టంగానే ఉంటుంది. ఈ వాసనను తొలగించడానికి మీరు బ్యాగును ఉతకాల్సిన అవసరం లేదు. ఉతక్కుండానే ఈ వాసనను తొలగించవచ్చు. దీని కోసం, తడి గుడ్డతో బ్యాగ్‌ను తుడిచి, ఎర్రటి ఎండలో ఆరబెట్టండి. ఇలా చేస్తే బ్యాగు మురికి వాసన చాలా వరకూ పోతుంది. బ్యాగ్ లోపలి భాగంలో సబ్బుతో తయారుచేసిన నీటిని స్ప్రే చేసి.. పొడి బట్టతో తుడిస్తే ఇంకా శుభ్రం అవుతుంది.
బ్రష్‌తో
స్కూలు లేదా ఆఫీస్ బ్యాగ్‌పై దుమ్ము, ధూళి పేరుకుపోతే, దాని వల్ల బ్యాగు చాలా మురికిగా కనిపిస్తుంది. అలాంటప్పుడు బ్యాగ్ కడగవలసిన అవసరం లేకుండానే లాండ్రీ సాఫ్ట్ బ్రష్ సహాయంతో దాన్ని శుభ్రం చేయవచ్చు. ఇందుకోసం బ్యాగును ఖాళీ చేసి దాని బయటి, లోపలి భాగాన్ని బ్రష్‌తో శుభ్రం చేయాలి. ఈ విధంగా బ్యాగ్ పై ఉండే దుమ్ము, మరకలు సులువుగా పోతాయి. బ్రష్ తో రుద్ది తడి గుడ్డతో తుడిచేస్తే చాలు బ్యాగు కొత్తదిలా మెరుస్తుంది.