– బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీల తర్జనభర్జన
– ప్రస్తుత పరిస్థితుల్లో గెలవగెలమా…?
– 2014, 2019తో పోలిస్తే రాజకీయ సమీకరణాలు మారటమే ప్రధాన కారణం
– ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల స్థానాలకు మాత్రం విపరీత పోటీ
– నేటి నుంచి పార్లమెంటు స్థానాల వారీగా సన్నాహక సమావేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఒకవైపు శాసనసభ ఎన్నికల్లో ఓటమి.. మరోవైపు తరుముకొస్తున్న లోక్‌సభ ఎన్నికలు… వెరసి బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీలు డైలమాలో ఉన్నారు. మరో మూడు నాలుగు నెలల్లో నిర్వహించబోయే పార్లమెంటు ఎలక్షన్లలో పోటీ చేయాలా..? వద్దా..? అనే మీమాంస వారిలో నెలకొంది. 2014లో తెలంగాణ ఉద్యమ వేడి, కొత్త రాష్ట్రం వచ్చిన ఊపులో గులాబీ పార్టీ అత్యధిక ఎంపీ (11) స్థానాలను కైవసం చేసుకుంది. 2018 డిసెంబరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గులాబీ జెండా ఎగరటంతో ఆ తర్వాత కొద్ది నెలలకే (2019 మే) వచ్చిన ఎంపీ ఎన్నికల్లో కారు పార్టీ 9 స్థానాల్లో విజయం సాధించింది. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందగా, బీఆర్‌ఎస్ 39 స్థానాలకే పరిమితమై ప్రతిపక్షంలో కూర్చుంది. మరోవైపు ఆ పార్టీ వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒకట్రెండు స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని సిట్టింగులకు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. గతంలో ప్రతీ జిల్లాలోనూ పది మంది ఎమ్మెల్యేలు, వారి అనుయాయులు, కార్యకర్తలు, క్రియాశీలక నేతలున్నారు. వారందరి సహకారంతో ఎంపీలుగా గెలిచారు. కానీ ఇప్పుడు ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో ఎలా నెగ్గుకురాగలమనే సందేహంతో సిట్టింగులు సతమతమవుతున్నారు. దాంతోపాటు ఒక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను, ఆయా స్థానాల్లోని నేతలను సమన్వయం చేయటం కత్తిమీద సాములాగా ఉంటుందని పలువురు ఎంపీలు ఆందో ళన చెందుతున్నారు. దీనికితోడు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ హవా కొనసాగుతుందనే అంచనాతో వారున్నారు. ఈ పరిస్థితుల్లో ఎంపీలుగా పోటీ చేయటం కంటే పక్కకు పోవటమే బెటరని వారు భావిస్తున్నట్టు వినికిడి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ పరువు నిలబెట్టిన జీహెచ్‌ఎమ్‌సీతోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని పార్లమెంటు సీట్లకు అత్యధిక మంది పోటీ పడుతున్నట్టు తెలిసింది. హైదరాబాద్ స్థానాన్ని తన మిత్రుడైన ఎంఐఎంకు వదిలేయాలని బీఆర్‌ఎస్ భావించిన క్రమంలో అది కాకుండా సికింద్రాబాద్, చేవెళ్లతోపాటు ఉత్తర తెలంగాణ జిల్ల్లాల్లోని పార్లమెంటు స్థానాలపై పోటీ చేసేందుకు పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. చేవెళ్ల ఎంపీ స్థానానికి ఇప్పటికే ఎంపీ రంజిత్ రెడ్డిని పోటీ చేయాలంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించిన సంగతి విదితమే. ఇదే సమయంలో ఇప్పటికే అనేక పదవులు అనుభవించిన వారికీ, సిట్టింగులకు, ఎమ్మెల్యేలుగా ఓడిపోయి మళ్లీ ఎంపీ టిక్కెట్ల కోసం ఆరాటపడుతున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్లు ఇవ్వొద్దంటూ పలువురు కీలక నేతలు అధిష్టానానికి చెప్పినట్టు సమాచారం. తమకు కాకుండా మళ్లీ అలాంటి వారికే అవకాశమిస్తే కచ్చితంగా ఓడిస్తామనే సంకేతాలను కూడా వారు ఇచ్చినట్టు తెలిసింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బుధవారం నుంచి నిర్వహించబోయే పార్లమెంటు నియోజకవర్గాలవారీ సన్నాహక సమావేశాల్లో బీఆర్‌ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలుత ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుంచి ఈ సమీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు… ఈనెల 12 వరకూ కొనసాగుతాయి. సంక్రాంతి సందర్భంగా 13 నుంచి 15 వరకు విరామమిచ్చి… 16 నుంచి కొనసాగిస్తారు. 21తో ఈ సన్నాహక సమావేశాలు పూర్తవుతాయి.