
ప్రశాంత వాతావరణంలో పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియకు అందరూ సహకరించాలని, నామినేషన్ల దాఖలుకు ఎన్నికల సిబంధనలను పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కె.జెండగే వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. బుధవారం ఆయన కాన్పరెన్స్ హాలులో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైనారు. ఈ సందర్భంగా ఆయన భువనగిరి -14 పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, అవలంబించాల్సిన విధానాలను వివరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ నెల 18 నుండి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని, ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల సమయంలో నామినేషన్లను అందించాల్సి ఉంటుందని తెలిపారు. సెలవు రోజు ఆదివారం మినహాయించి, మిగితా అన్ని పని దినాలను కలుపుకుని, తుది గడువు అయిన ఈ నెల 25 తేదీ మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడతాయని అన్నారు. నిర్ణీత గడువు లోపు రిటర్నింగ్ అధికారి వద్దకు చేరుకున్న వారి నామినేషన్ ఫారాలు మాత్రమే స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. నామినేషన్ల సెక్యూరిటీ డిపాజిట్ క్రింద జనరల్ కేటగిరి చెందిన అభ్యర్థులు 25 వేలు, SC, ST కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 12 వేల ఐదు వందలు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు.ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని, అభ్యర్థి వెంట మరో నలుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తారని, రిటర్నింగ్ కార్యాలయం వద్ద 100 మీటర్ల వరకు 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేసే నియోజకవర్గం లోని ఎవరైనా ఒక ఓటరు నామినేషన్ ను ప్రతిపాదిస్తే సరిపోతుందని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేరే పార్లమెంటు సెగ్మెంట్ కు చెందినవారైన పక్షంలో తప్పనిసరిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ ఏ.ఆర్.ఓ. నుండి ఓటరు ధ్రువీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంకు అకౌంట్ తెరవాలని, దీని ద్వారానే ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీలు నిర్వహిస్తూ పక్కాగా రికార్డులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షల వరకు ఎన్నికలలో ఖర్చు చేయవచ్చన్నారు. సంబంధిత బ్యాంకు అకౌంట్ లావాదేవీల ఆధారంగానే అభ్యర్థుల వ్యయాన్ని లెక్కించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు తమపై ఏవైనా క్రిమినల్ కేసులు ఉంటే నామినేషన్ పత్రంలో వివరాలను తప్పనిసరిగా పొందుపర్చాలని అన్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థి, లేదా ప్రతిపాదించిన వారే స్వయంగా హాజరై నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఆర్.ఓ. సమక్షంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రమాణం చేయాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ సమర్పించే ముందు అన్ని అంశాలను క్షుణ్ణంగా చూసుకోవాలని, అన్నింటిని నమోదు చేయాలని, అభ్యర్థులకు సహాయపడేందుకు ఆర్.ఓ. కార్యాలయం వద్ద హెల్ప్ డెస్క్ సైతం ఏర్పాటు చేస్తామని తెలిపారు. దాఖలైన నామినేషన్లను ఈ నెల 26 న పరిశీలించడం జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణకు 29వ తేదీ చివరి గడువు అని తెలిపారు. ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలకు ముందస్తుగానే సువిధ ద్వారా దరఖాస్తులు చేసుకుని అనుమతి పొందాలని, ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా అనుమతి ఇవ్వడం జరుగుతుందని సూచించారు. కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు వంటివి ముంద్రించే విషయంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 127 లోని సూచనలు పాటించాలన్నారు. ఎన్నికల ప్రచార ప్రకటనలు, ప్రచార అంశాలు, ఎల్.ఈ.డీ. డిస్ ప్లే కంటెంట్ తదితర వాటికి ఎం.సి.ఎం.సి. ద్వారా అనుమతులు తీసుకోవాలని సూచించారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధి మొత్తంలో నిర్వహించే ప్రచార కార్యక్రమాలు, ఎల్.ఈ.డీ. వాహనాలు, హెలిప్యాడ్, హెలికాప్టర్ వంటి వాటి అనుమతులను ఆర్.ఓ. కార్యాలయం నుండి పొందాలని సూచించారు. కనీసం 48 గంటల ముందు సువిధ పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి.బెన్ షాలోమ్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె.గంగాధర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నాగేశ్వరాచారి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బహు జన సమాజ్ పార్టీ నుండి బట్టు రామచంద్రయ్య, సిపిఎం బట్టుపల్లి అనూరాధ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి కూరవెంకటేశ్, సోమ రవీందర్ రెడ్డి, ముల్తాన్ షా, భారత రాష్ట్ర సమితి నుండి రచ్చ శ్రీనివాస రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి రత్నపురం బలరాం, ఎదుగాని సంతోశ్, పాల్గొన్నారు.