– ఐసీడీఎస్ కార్యాలయంలో నోటీసు అందజేత
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపడుతున్న దేశ వ్యాప్త సమ్మెకు సహకరించాలని అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజ్యలక్ష్మి కోరారు. శనివారం పలు కార్మక సంఘాల ఆధ్వర్యంలో ఐసీడీఎస్ అధికారులకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ రకాల సంఘాల ఉద్యోగ సంఘాలు కలిసి ఈ నెల 16న అఖిలభారత స్థాయిలో కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ పాటించాలని నిర్ణయించాయన్నారు. తాము రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాలకు అనుబంధం యూని యన్‌గా ఉన్నామన్నారు. ఐసీడీఎస్‌కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెంచాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు. ధరలకు అనుగుణంగా వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. అనేక డిమాండ్లతో ఈ సమ్మెతో పాటు గ్రామీణ బంద్‌లో భాగస్వాములవుతామని చెప్పారు. మధ్యాహ్నా భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి స్వప్న, సీఐటీయూ మున్సిపల్ కన్వీనర్ ఎల్లేశ, మంచాల మండల కన్వీనర్ పోచమోని కృష్ణ, ఇబ్రహీంపట్నం మండల కన్వీనర్ సీహెచ్ బుగ్గరాములు, ఆదిభట్ల మున్సిపల్ కన్వీనర్ నర్సింహ, అంగన్‌వాడీ జిల్లా నాయకురాలు బేబీ, బాలమణి, అంగ న్‌వాడీ టీచర్స్ పద్మ, పెంటమ్మ, తదితరులు పాల్గొన్నారు.