న్యూఢిల్లీ : రెండు వేల రూపాయల కరెన్సీ నోటును చలామణి నుండి ఉపసంహ రిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ప్రతిపక్ష పార్టీలు శనివారం మండిపడ్డాయి. గతంలో చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. నోట్ల రద్దు ప్రహసనంపై నిస్పాక్షిక విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘మొదటిసారి నోట్ల రద్దు నిర్ణయం తీసుకొని దేశ ఆర్థిక వ్యవస్థకు లోతైన గాయం చేశారు. దీనివల్ల అసంఘటిత రంగం మొత్తం నాశనమైంది. చిన్న, మధ్య తరహా సంస్థలు మూతపడ్డాయి. కోట్లాది ఉద్యోగాలు పోయాయి’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు రూ. 2000 నోటును రద్దు చేస్తున్నారని అంటూ ఇది మొదటి తప్పును కప్పిపుచ్చుకోవడానికా అని ప్రశ్నించారు. నిస్పాక్షిక విచారణ మాత్రమే వాస్తవాలను బయటపెడుతుందని తెలిపారు. రాజ్యసభలో స్వతంత్ర సభ్యుడు కపిల్ సిబల్ కూడా కేంద్ర నిర్ణయంపై విమర్శలు చేశారు. అవినీతిని నిర్మూలించేందుకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని 2016లో ప్రధాని చెప్పుకొచ్చారని గుర్తు చేశారు. 2016లో రూ. 17.7 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉంటే 2022లో రూ. 30.18 లక్షల కోట్లు చలామణిలో ఉన్నదని, మరి అవినీతి ఎక్కడ తగ్గిందని ప్రధానిని ప్రశ్నించారు. నగదు టాయిలెట్ కాగితంగా మారిందని ప్రజలు భయపడుతున్నారని, ఏ నాగరిక దేశం కూడా తన ప్రజలను ఇలా భయాందోళనలకు గురి చేయదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. అసలు రూ. 2000 నోటును ఎందుకు ప్రవేశపెట్టారని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. త్వరలో రూ. 500 నోటును కూడా రద్దు చేస్తారా అని అడిగారు. నోట్ల రద్దు వ్యవస్థీకృత దోపిడీ అని, చట్టబద్ధమైన తప్పిదమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన మాటలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గుర్తు చేశారు. ప్రధాని మోడీ అనాలోచిత నిర్ణయాలకు ఇది ఒక ఉదాహరణ అని ఆయన చెప్పారు.