పథకాలపై అవగాహన కల్పించడానికే

పథకాలపై అవగాహన కల్పించడానికే– వీక్షిత్‌ సంకల్ప యాత్ర గవర్నర్‌ తమిళిసై
–  మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో సంకల్ప యాత్ర ప్రారంభం
నవతెలంగాణ-శామీర్‌పేట
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై గ్రామాల్లో అవగాహన కల్పించడమే వీక్షిత్‌ సంకల్ప యాత్ర ఉద్దేశమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ అన్నారు. శనివారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేటలో భారత్‌ సంకల్ప యాత్రను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎంతో దూర దృష్టితో అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రధాని మోడీ తీసుకొచ్చిన ఎన్నో కార్యక్రమాలను దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా రథయాత్రను ప్రారంభించినట్టు చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీ వద్దకు వచ్చి మోడీ చేపట్టిన అన్ని కార్యక్రమాలను ప్రజలకు సవివరంగా తెలిసే విధంగా రథయాత్రను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ అడిషనల్‌ సెక్రటరీ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ శాంతమను, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌, అడిషనల్‌ కలెక్టర్‌ విజయేందర్‌ రెడ్డి, జెడ్పీటీసీ అనిత లాలయ్య, ఎంపీపీ దాసరి యెల్లుబాయి, తహసీల్దార్‌ సత్యనారాయణ, సర్పంచ్‌ గీతామహేందర్‌, ఉపసర్పంచ్‌ రవికిరణ్‌ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్‌ రెడ్డి, నాయకులు మోహన్‌ రెడ్డి, సుకుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.