ప్రజలను మోసగించేందుకే..

To deceive people..– మోడీ పర్యటనపై సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ
– విభజన హామీలపై నిర్దిష్ట ప్రకటన చేయాలని డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన ప్రజలను మోసగించడం కోసమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విమర్శించింది. విభజన సందర్భంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రధాని మోడీకి రాష్ట్రంలో పర్యటించే అర్హత ఉందా?అని ప్రశ్నించింది. విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోడీ వచ్చేనెల ఒకటిన మహబూబ్‌నగర్‌, మూడున నిజామాబాద్‌ జిల్లాల పర్యటనకు వస్తున్నారని తెలిపారు. ఇది కేవలం ఎన్నికల ప్రచారం కోసమేనని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సందర్భంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్టీపీసీ నాలుగు వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, నిమ్జ్‌, ఐటీఐఆర్‌, కృష్ణాజలాల నీటి పంపకం, తెలంగాణకు ఇవ్వాల్సిన మెడికల్‌ కాలేజీలు, రైల్వేలైన్లు వంటి హామీలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. నేటికీ వాటి అమలు ఊసేలేదని విమర్శించారు. అలాగే పోలవరం తరహాలోనే గోదావరి లేదా కృష్ణా నదులపై ప్రాజెక్టులు చేపట్టాలని తెలిపారు. ఇవికాక మరెన్నో వనరులు తెలంగాణకు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ వాటిపై ఎలాంటి నిర్దిష్టమైన కార్యాచరణ లేకుండా రాష్ట్రంలో పర్యటించడం ప్రజలను మోసగించడమేనని తెలిపారు. వెనకబడి వలసలకు నెలవైన మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. తుంగభద్రపై నీటి అనుమతి లేని ప్రాజెక్టుకు కర్నాటక ఎన్నికల కోసం జాతీయ హోదా ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇక్కడ మాత్రం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కేటాయించకపోవడం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేయడమేనని విమర్శించారు. రాష్ట్ర పర్యటనకు ముందే విభజన హామీలపై ప్రధాని నిర్దిష్ట ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.