– విక్షిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ : మన్‌కీ బాత్‌లో మోడీ
న్యూఢిల్లీ : యువతను ముఖ్యంగా రాజకీయేతర నేపథ్యం ఉన్న యువతను రాజకీయాల వైపు మళ్లించేందుకు 2025 జనవరిలో విక్షిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌ను నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే యువజనోత్సవాల్లో భాగంగా న్యూఢిల్లీలో జనవరి 11, 12 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. దేశం నలుమూలల నుంచి రెండు వేల మంది యువత ఇందులో పాల్గొంటారని చెప్పారు. అలాగే కనీసం లక్ష మంది యువతను రాజకీయాల్లోకి చేర్చేందుకు వివిధ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రధాని చెప్పారు. మన్ కీ బాత్ ప్రసంగంలో మోడీ ఈ విషయాలను తెలిపారు. అలాగే నవంబర్ 24న ఎన్‌సీసీ డే అని గుర్తు చేస్తూ యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవ స్ఫూర్తిని ఎస్‌సీసీ నింపుతుందని చెప్పారు. అలాగే సమాజం కోసం నిస్వార్థంగా పని చేస్తున్న కొంత మంది యువకులను మోడీ ఈ సందర్భంగా ప్రశంసించారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లు పొందడంలో వృద్ధులకు లక్నోకు చెందిన వీరేంద్ర, భోపాల్ చెందిన మహేష్ మొబైల్ ద్వారా చెల్లింపులు చేయడంలోనూ సహాయ పడుతున్నారని చెప్పారు. ఇటీవల తన గయానా పర్యటన గురించి మోడీ వెల్లడించారు.