అందమైన మెరిసే చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. అయితే వయసు, కాలాన్ని బట్టి చర్మంపై అప్పుడప్పుడు మొటిమలు వస్తుంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పాడు చేస్తాయి. వీటిని సులువుగా పోగొట్టాలంటే కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే….
కలబంద : దీనిని అలోవెరా అని కూడా అంటాం. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఇందులో ఎక్కువ. ఇది మొటిమల వల్ల వచ్చే ఎరుపు, వాపును తీసేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. తాజా కలబంద జెల్‌ను నేరుగా ముఖంపై అప్లై చేసి, 15-20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. దీనిని వారంలో ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేసి చూస్తే తేడా గమనించవచ్చు.
పసుపు : ఇంటి, వంట అవసరాలలో ఉపయోగించే పసుపు చర్మ సంరక్షణలో అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని కర్కుమిన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. పసుపును నీరు లేదా తేనెతో కలిపి పేస్ట్‌లా చేసి ముఖంపై 15-20 నిమిషాల పాటు అప్లై చేస్తూ ఉండాలి. ఆ తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేసి, ఆరిన తర్వాత మెల్లగా మసాజ్ చేసినట్టు తడిచేసి రుద్దుతూ కడిగేయాలి. ఇలా చేస్తే ముఖంపై ఉండే మచ్చలు వంటివి, మృత కణాలు కూడా తొలగిపోతాయి.
టీ ట్రీ ఆయిల్ : కొన్నేళ్లుగా చర్మ సంరక్షణ లో టీ ట్రీ ఆయిల్ ప్రధానపాత్ర పోషిస్తోంది. ఈ ఎసెన్షియల్ ఆయిల్‌లో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో సమర్థవంతంగా పోరాడగల వని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ ఆయిల్‌ను డైరెక్ట్‌గా చర్మంపై అప్లై చేయకూ డదు. దీని గాఢతను తగ్గించిన తర్వాతనే ఉపయోగించాలి. అంతేకాదు, ఇది ఉపయో గించేపుడు చేతులతో కాకుండా కాటన్ బాల్స్ ఉపయోగించడం మంచిది. రాత్రి పడుకునే ముందు ఈ ఆయిల్ మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. ఉదయానికి తేడా తెలుస్తుంది.
తేనె : తేనె సహజ మాయిశ్చరైజింగ్, యాంటీ బాక్టీరియల్ ఏజెంట్. మొటిమలు ఉన్న ప్రాంతంలో తేనెను రాసి, 15-20 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇది మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడడంతో పాటు చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. తేనెను నేరుగా కాకుండా ఏదైనా చర్మ సంరక్షణ సాధనంతో కలపి ముఖంపై అప్లై చేసుకోవాలి.
వీటిని ఉపయోగించడం వల్ల చర్మం మెరవడంతోపాటు ఆరోగ్యంగా ఉంటుంది. మొటిమలను నివారించవచ్చు.