పసిడితో పారిస్‌కు..

పసిడితో పారిస్‌కు..– ఇషా సింగ్‌, వరుణ్‌ ఒలింపిక్స్‌కు అర్హత
జకర్తా (ఇండోనేషియా) : భారత యువ షూటర్‌, తెలంగాణ స్టార్‌ ఇషా సింగ్‌ గన్‌తో మళ్లీ అదరగొట్టింది. జకర్తాలో జరుగుతున్న ఒలింపిక్స్‌ 2024 ఆసియా క్వాలిఫయర్స్‌లో పసిడి గురితో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో ఇషా సింగ్‌ పసిడి పతకం సాధించి పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఫైనల్లో ఇషా సింగ్‌ 243.1 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. పాక్‌ షూటర్‌ తలట్‌ 236.3 స్కోరుతో సిల్వర్‌ మెడల్‌ దక్కించుకుంది. భారత మరో షూటర్‌ రిథమ్‌ సంగ్వాన్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించగా, సురభి రావు ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌, వరుణ్‌ తోమర్‌ మెన్స్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో సత్తా చాటాడు. ఫైనల్లో 239.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకంతో పాటు పారిస్‌ ఒలింపిక్‌ బెర్త్‌ దక్కించుకున్నాడు. అర్జున్‌ చీమ 237.3 పాయింట్లతో సిల్వర్‌ సాధించగా, మంగోలియా షూటర్‌ 217.2తో కాంస్యం అందుకున్నాడు. ఓవరాల్‌గా భారత షూటర్లు ఇప్పటివరకు 15 ఒలింపిక్‌ బెర్త్‌లు సాధించారు. ఆసియా క్వాలిఫయర్స్‌లో 16 ఒలింపిక్‌ బెర్తులు అందుబాటులో ఉండగా.. భారత్‌ పోటీల తొలి రోజే రెండు ఒలింపిక్‌ బెర్తులు సొంతం చేసుకుంది.