సింగరేణి పరిరక్షించాలంటే

–  ఏఐటీయూసీని గెలిపించాలి
–  బీఆర్‌ఎస్‌ స్వేదంతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది
–  సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షులు కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సింగరేణి కాలరీస్‌ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించాలని సింగరేణి వర్కర్స్‌ యూనియర్‌ గౌరవాధ్యక్షులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. కొత్త గనుల్లేకుంటే 15, 20 ఏండ్లలో సింగరేణి మూతపడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఐఎన్‌టీయూసీలో ఉన్న వాళ్లు బీఆర్‌ఎస్‌ అధికారంలో వచ్చాక టీబీజీకేఎస్‌లో చేరారని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో టీజీజీకేఎస్‌ నుంచి మళ్లీ ఐఎన్‌టీయూసీలో చేరుతున్నారని అన్నారు. ఒకప్పుడు 1.19 లక్షల మంది కార్మికులున్న సింగరేణిలో ప్రస్తుతం ఆ సంఖ్య 39 వేలకు తగ్గిందని వివరించారు. సింగరేణి సీఎండీగా తొమ్మిదిన్నరేండ్లుగా ఒక్కరే కొనసాగుతున్నారని చెప్పారు. గుర్తింపు సంఘం, ఆయనకు మధ్య క్విడ్‌ప్రోకో జరిగిందన్నారు. సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, టీబీజీకేఎస్‌ మధ్య త్రిముఖ పోటీ ఉందని చెప్పారు. కాంగ్రెస్‌, సీపీఐకి మధ్య తగువుల్లేవని స్పష్టం చేశారు. అయితే సింగరేణి ఎన్నికలు రాజకీయ పార్టీలకు సంబంధం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ స్వేదం చిందించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఎద్దేవా చేశారు. చెమటలు చిందించి ఆస్తులను పెంచితే ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ సృష్టించిన సంపద అంతా ఎటుపోయిందని అడిగారు. సింగరేణి, ఆర్టీసీ, ట్రాన్స్‌కో, జెన్‌కో, పౌరసరఫరాల సంస్థలను అప్పులపాలు చేసిందన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు రావాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, ఎన్‌ బాలమల్లేశ్‌ ఈటి.నరసింహా తదితరులు పాల్గొన్నారు.