సమాజానికి జ్ఞాన భాండాగారాన్ని అందించాలి

to society Provide a repository of knowledge– ఈ నెల 19 నుంచి 29 వరకు 37వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌
– హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ అధ్యక్షులు డా.యాకూబ్‌
– అందుబాటులో అన్ని రకాల భాషల పుస్తకాలు : సొసైటీ కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌ (వాసు)
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
బుక్‌ ఫెయిర్‌ అంటే పుస్తకాలు అమ్ముకోవడం కాదని, జ్ఞాన భాండాగారాన్ని సమాజానికి అందించడమని హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ అధ్యక్షులు డా.యాకుబ్‌ షేక్‌ అన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ప్రతి ఏడాదీ జరిగే ఈ బుక్‌ ఫెయిర్‌ ఒక ముఖ్యమైన సాహిత్య పుస్తకాల పండుగగా రూపుదిద్దుకుంటోందని చెప్పారు. ఈ నెల 19 నుంచి 29వ తేదీ వరకు 37వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ బుక్‌ ఫెయిర్‌ ఉంటుందని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ బుక్‌ ఫెయిర్‌లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ విదేశాల నుంచి ప్రచురణకర్తలు, పంపిణీదారులు దాదాపు 380కు పైగా స్టాళ్లలో పుస్తకాలను ప్రదర్శిస్తారని చెప్పారు. తమ సొంత రచనలు, ప్రచురణలను పాఠకులకు పరిచయం చేసుకోవడానికి రచయితలకు ప్రత్యేక రైటర్‌ స్టాల్స్‌ కేటాయిస్తున్నామని, ప్రత్యేక మీడియా సెంటర్లు, వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్‌ కూడా ఉంటాయని వివరించారు. ఈ 37వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ప్రాంగణానికి దాశరథి కృష్ణమాచార్య, సభ కార్యక్రమాల వేదికకు బోయి విజయభారతి, పుస్తకాల ఆవిష్కరణ వేదికను తోపుడుబండి సాధిక్‌ పేర్లతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బుక్‌ ఫెయిర్‌ సొసైటీ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి, కార్యక్రమ నిర్వహణలో సూచనలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎం.కోదండరామ్‌, సీనియర్‌ ఎడిటర్‌ కె.రామచంద్రమూర్తి, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఆచార్య రమామేల్కొటే సలహాదారులుగా ఉన్నారన్నారు.
బుక్‌ ఫెయిర్‌లను వ్యాపారం కోసం కాకుండా తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనం కోసం నిర్వహిస్తున్నామన్నారు. నేటి సెల్‌ఫోన్‌ యుగంలోనూ పుస్తక పఠనం తగ్గలేద న్నారు. ప్రతి ఊరిలో ఒక లైబ్రరీ ఉంటే ఆ ఊరు జ్ఞాన సమాజం వైపు పయనిస్తుందని చెప్పారు. జ్ఞాన సమాజం ఏర్పడటానికి ఈ హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు, యువతలో జ్ఞానాన్ని ప్రభావితం చేయడమే తమ సొసైటీ ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
సొసైటీ కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడుతూ.. ఢిల్లీ, మద్రాస్‌, కలకత్తా నగరాల్లో బుక్‌ ఫెయిర్‌లు నడుపుతున్నారని, వాటికి దీటుగా తమ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ఉంటుందని, దీన్ని ఎంతో వినూత్నంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి పంపిణీదారులు, ప్రచురణకర్తలు, రచయితల పుస్తకాలు, అన్ని రకాల భాషల పుస్తకాలు ఇందులో అందుబాటులో ఉంటాయన్నారు. ఇందులో 171 ఇంగ్లీష్‌, 168 తెలుగు, ఉర్దూ, హిందీ స్టాల్స్‌ ఉంటాయన్నారు. పది రోజులపాటు జరిగే ఈ బుక్‌ఫెయిర్‌లో సందర్శకులకు తెలంగాణ వంటకాలు, హైదరాబాద్‌ బిర్యానీ, ఇరానీ చారు, పావ్‌బాజీ వంటి తదితర వంటకాలు అందుబాటులో ఉంటాయ న్నారు. బుక్‌ ఫెయిర్‌ ప్రారంభోత్సవం రోజున బుక్‌ వాక్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. బుక్‌ ఫెయిర్‌లో పలు కంపెనీల సీఈవోలు, ప్రభుత్వ ప్రతినిధులు, అన్ని పత్రికల సంపాదకులను భాగస్వామ్యం చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సొసైటీ ట్రెజరర్‌ పి.నారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఉపాధ్యక్షులు కె.బాల్‌ రెడ్డి, బి.శోభన్‌ బాబు, సంయుక్త కార్యదర్శులు కె.సురేష్‌, ఎం.సూరిబాబు, సభ్యులు ఎ.జనార్దన్‌ గుప్త, జి.విజయరావు, ఎన్‌.మధుకర్‌, ఎన్‌.కోటేశ్వరరావు, ఆర్‌.శ్రీకాంత్‌,యు.శ్రీనివాసరావు, టి.సాంబశివరావు, స్వరాజ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.