– సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ వేటలో రోహిత్‌సేన
– దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టెస్టు నేటి నుంచి
– కంచుకోట సెంచూరియన్‌లో దీమాగా సఫారీ
– మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఆధునిక క్రికెట్‌లో టీమ్ ఇండియా అన్ని విజయాలు సొంతం చేసుకుంది. అసాధ్యం అనుకున్న విదేశీ గడ్డపై టెస్టు సిరీస్ విజయాలను వరుసగా సొంతం చేసుకుంది. కానీ సఫారీ సవాల్ మాత్రం ఇప్పటికీ సవాల్‌గా మిగిలిపోయింది. దక్షిణాఫ్రికా పర్యటనకు ఎన్ని సార్లు వెళ్లినా.. ప్రతిసారీ టెస్టు సిరీస్ వేటలో పరాజయమే పలుకరిస్తోంది.
2023 ప్రపంచకప్ ఓటమి బాధలో ఉన్న టీమ్ ఇండియా.. 2024 టీ20 ప్రపంచకప్ వేట ముంగిట ఓ రికార్డుపై కన్నేసింది. సఫారీ కోటను బద్దలు కొట్టి టెస్టు సిరీస్ విజయం సొంతం చేసుకోవాలని తపిస్తోంది. దక్షిణాఫ్రికా కంచుకోట సెంచూరియన్‌లో నేటి నుంచి భారత్, సఫారీ తొలి టెస్టు సమరం షురూ.
నవతెలంగాణ-సెంచూరియన్
బాక్సిండ్ డే సమరానికి రంగం సిద్ధమైంది. ఓ వైపు ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లు సై అంటుండగా.. మరోవైపు భారత్, దక్షిణాఫ్రికాలు సైతం రెడ్‌బాల్ పరీక్షకు సన్నద్ధం అవుతున్నాయి. 2021 సఫారీ పర్యటనలో తొలి టెస్టులోనే సెంచూరియన్‌లో సంచలన విజయం సాధించిన కోహ్లిసేన.. దక్షిణాఫ్రికా గడ్డపై అద్వితీయ టెస్టు సిరీస్ దిశగా కీలక అడుగు వేసింది. కానీ తర్వాతి రెండు టెస్టుల్లోనూ భారత్‌కు కఠిన ఫలితాలు ఎదురయ్యాయి. దీంతో టెస్టు సిరీస్ విజయం మళ్లీ కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు రోహిత్‌సేన సైతం అదే స్వప్నంతో సఫారీ గడ్డపై కాలుమోపింది. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాను ఢకొీట్టేందుకు సిద్ధమైంది. వైట్‌బాల్ ఫార్మాట్‌లో స్టార్ ఆటగాళ్లు లేకపోవటంతో ఆ సిరీస్‌లు కాస్త కళ తప్పాయి. టెస్టు సిరీస్‌కు ఇరు జట్లు పూర్తి స్థాయి బృందంతో రంగంలోకి దిగుతున్నాయి. పేసర్లు ఫలితాన్ని శాసించే సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా బాక్సిండ్ డే ధమాకా నేటి నుంచి ఆరంభం.
సరికొత్తగా.. భారత్
టీమ్ ఇండియా టెస్టు జట్టు సరికొత్తగా కనిపిస్తోంది. అజింక్య రహానె, చతేశ్వర్ పుజారా లేకుండా భారత్ టెస్టు సిరీస్‌కు సన్నద్ధం అయ్యింది. యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ జట్టులో కీలక బాధ్యతలు అందుకుంటున్నారు. యశస్వి జైస్వాల్ కరీబియన్ పర్యటనలో సత్తా చాటాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో తనేంటో నిరూపించుకున్నాడు. శుభ్‌మన్ గిల్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా ఎదుగుతున్నాడు. ఈ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో మెరిస్తే భారత్ పరుగుల పండుగ చేసుకోగలదు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు భారత్‌కు కీలకం. వన్డే వరల్డ్‌కప్ బాధలో ఉన్న ఈ ఇద్దరు టెస్టు క్రికెట్ మూడ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. రోహిత్ ఇటీవల ధనాధన్ ఆటతో మెరుస్తున్నాడు యశస్వి జైస్వాల్ తోడుగా రోహిత్ శర్మ దంచికొడితే సఫారీ పేసర్లకు చుక్కలే!. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ సరికొత్త పాత్ర పోషించనున్నాడు. వైట్‌బాల్ ఫార్మాట్‌లో వికెట్ కీపింగ్ బాధ్యతల్లో మెప్పించిన రాహుల్.. టెస్టుల్లో తొలిసారి గ్లౌవ్స్ అందుకోనున్నాడు. లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, వికెట్ల వెనకాల కెఎల్ రాహుల్ ప్రదర్శనపై ఫోకస్ ఉండనుంది. గతంలో ఇక్కడ ఆడిన టెస్టులో కెఎల్ రాహుల్ సెంచరీ సాధించాడు. ఆ ఉత్సాహంతోనే అతడు ఈ టెస్టుకు సిద్ధమవుతున్నాడు. జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణలు ప్రధాన పేసర్లుగా ఉండనున్నారు. ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ తుది జట్టులో నిలిచే అవకాశం ఉంది.
దీమాగా సఫారీలు
భారత జట్టు ప్రతిసారీ బలమైన జట్టుతో సఫారీ గడ్డపై అడుగుపెట్టినా.. అంతే బలంగా టీమ్ ఇండియాను నైరాశ్యంలోకి నెట్టేసిన చరిత్ర దక్షిణాఫ్రికా సొంతం. ఇప్పుడూ అదే ఉత్సాహంతో ఆ జట్టు కనిపిస్తోంది. వైట్‌బాల్ ఫార్మాట్ నుంచి విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ తెంబ బవుమా.. టెస్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు. స్టార్ బ్యాటర్ ఎడెన్ మార్క్‌రామ్ సఫారీలకు ఆల్ ఫార్మాట్ స్టార్‌గా కనిపిస్తున్నాడు. ఇటీవల వన్డేలు, టీ20ల్లో సత్తా చాటాడు. టెస్టులో మళ్లీ టాప్ ఆర్డర్‌లో వస్తోన్న మార్క్‌రామ్.. పరుగుల వరద పారించేందుకు ఎదురు చూస్తున్నాడు. డీన్ ఎల్గార్, కీగన్ పీటర్సన్ సైతం అంచనాలను అందుకుంటే సఫారీలకు పెద్దగా సమస్య ఉండదు. మార్కో జాన్సెన్, జెరాల్డ్ కోయేట్జి, కగిసో రబాడ, లుంగిసాని ఎంగిడిలతో కూడిన పేస్ లైనప్ భారత్‌కు సవాల్ విసిరేందుకు సిద్ధమవుతోంది. కేశవ్ మహరాజ్ ఏకైక స్పిన్నర్‌గా తుది జట్టులో నిలువనున్నాడు.
పేసర్ల స్వర్గధామం
సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ దక్షిణాఫ్రికాలోని అత్యంత వేగవంతమైన పిచ్‌లలో ఒకటి. తొలి రోజు ఆటతో పాటు టెస్టు మ్యాచ్‌కు వర్షం సూచనలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు పేసర్లకు మరింత అనుకూలిస్తాయి. దీంతో సెంచూరియన్ పేసర్ల స్వర్గధామం కానుంది. సూపర్‌స్పోర్ట్ పార్క్ సఫారీలకు పెట్టని కోట. ఇక్కడ జరిగిన 28 టెస్టుల్లో ఆతిథ్య జట్టు ఏకంగా 22 టెస్టుల్లో విజయాలు సాధించింది. గత 9 చివరి టెస్టుల్లో 8 విజయాలు నమోదు చేసింది. 2021 పర్యటనలో భారత ఇక్కడ దక్షిణాఫ్రికాపై చారిత్రక విజయం నమోదు చేసింది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, జశ్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.
దక్షిణాఫ్రికా : డీన్ ఎల్గార్, ఎడెన్ మార్క్‌రామ్, టోనీ డీ జార్జి, తెంబ బవుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్, కైల్ వెర్రెన్నె (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, జెరాల్డ్ కొయేట్జి, కగిసో రబాడ, లుంగిసాని ఎంగిడి.
తొలి రోజు కష్టమే!
భారత్, దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట కష్టమే. సెంచూరియన్‌లో వర్షం కారణంగా సోమవారం ఇరు జట్ల ప్రాక్లీస్ సెషన్లకు దూరమయ్యాయి. ప్రాక్టీస్ సెషన్లు షెడ్యూల్ ప్రకారం సాగలేదు. తొలి రోజు సైతం వరుణ గండం పొంచి ఉంది. దీంతో నేడు ఆట సాధ్యపడేది అనుమానమే. రెండో రోజు సైతం వర్షం సూచనలు కనిపిస్తున్నా.. ఆట సాగుతుందని అంచనా వేస్తున్నారు. వేగవంతమైన పిచ్, వర్షంతో పేసర్లు పంజా విసరటం ఖాయం. ఫలితంగా అశ్విన్ స్థానంలో
శార్దుల్ ఠాకూర్ టీమ్ ఇండియా తుది జట్టులో నిలిచే అవకాశం కనిపిస్తోంది.