అందినకాడికి దోచుకోవడమే..

 It is to rob the recipient..– పార్సిల్స్‌ పేరుతో.. సైబర్‌ నేరస్తుల బెదిరింపులు
– డ్రగ్స్‌, పాస్‌పోర్ట్సు ఉన్నాయంటూ.. దండుకుంటున్న వైనం
– ముంబరు సైబర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ నుంచంటూ పోలీస్‌ డ్రెస్‌లో వీడియో కాల్స్‌
– డబ్బులు లేకుంటే మరీ రుణాలు పెట్టించి వసూళ్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇటీవల కాలంలో రోజుకో తీరులో సైబర్‌ మోసాలు వెలుగు చూస్తున్నాయి. సులభంగా డబ్బు సంపాదించేందుకు కొందరు కేటుగాళ్లు మోసాల బాటపట్టారు. మాయమాటలతో బెదిరించి అందిన కాడికి దోచుకుంటున్నారు. తమ పేరుతో పార్సిల్‌ వచ్చిందని, అందులో డ్రగ్స్‌, పాస్‌పోర్టులు ఉన్నాయంటూ బెదిరిస్తున్నారు. కొందరు ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి వేధిస్తున్నారు. మరికొందరు ప్రొఫైల్స్‌ను డౌన్‌లోడ్‌ చేసి వారి వ్యక్తిగత వివరాలన్నీ చెబుతుండటంతో బాధితులు నేరస్తులు చెప్పినట్టు చేస్తున్నారు. హనీ ట్రాప్‌ ద్వారా వృద్ధులు, యువకులను టార్గెట్‌ చేస్తున్నారు. తాజాగా ముంబరు క్రైమ్‌ బ్రాంచ్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామని, అడిగిన వివరాలు చెప్పకుంటే కేసు సీబీఐకి ట్రాన్స్‌ఫర్‌ చేస్తామంటూ నకిలీ పత్రాలు చూపుతూ డబ్బులు గుంజుతున్నారు.
బెదిరించి మరీ దండుకున్న నేరస్తులు
హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితునికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వీడియో కాల్‌ వచ్చింది. నేను ముంబరు సైబర్‌క్రైమ్‌ బ్రాంచ్‌ నుంచి మాట్లాడుతున్నా, నీ పేరు ఇదేనా అని ప్రశ్నించాడు. ఆందోళనకు గురైన బాధితుడు అవునని సమాధానం ఇవ్వడంతో, నీకు ‘ఫెడెక్స్‌ కొరియర్‌లో’ పార్శల్‌ వచ్చిందని, దాన్ని పరిశీలిస్తే అందులో 5 పాస్‌పోర్ట్సు, ఒక ల్యాప్‌టాప్‌, 30 ప్యాకెట్స్‌లో (ఎల్‌ఎస్‌డీ) మాదక ద్రవ్యాలున్నాయని బెదిరించారు. మా సార్‌ మాట్లాడుతాడు వెంటనే ఓ రూమ్‌లోకి వెళ్లి వీడియో కాల్‌ చేరు అంటూ బెదిరించారు. ఆందోళనకు గురైన బాధితుడు వారు చెప్పిన విధంగా చేశాడు. నీ మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని ‘ఎఫ్‌.ఐ.ఆర్‌ ఎంహెచ్‌ 1085’ పంపించారు. దాదాపు 2 గంటలపాటు విచారించిన సైబర్‌ నేరస్తులు పూర్తి వివరాలను సేకరించారు. కేసును మాఫీ చేయాలంటే లక్షల్లో డిమాండ్‌ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే కేసును సీబీఐ ముంబరు బ్రాంచ్‌కు పంపిస్తామని బెదిరించారు. అంత డబ్బులు తన వద్ద లేవని బాధితుడు ప్రాధేయపడగా, బ్యాంక్‌ నుంచి లోన్‌ తీసుకుని కట్టాలని ఆదేశించారు. వారుచెప్పిన విధంగా బాధితుడు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి రూ.20లక్షలు లోన్‌ తీసుకుని వారికి రూ.19,94,101 పంపించాడు. కొద్దిరోజుల తర్వాత విషయాన్ని ఇంట్లో చెప్పడంతో అసలు విషయాన్ని గుర్తించారు. మోసపోయినట్టు తెలుసుకున్న బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదే తరహాలో పలువురిని మోసం చేస్తున్న సైబర్‌ నేరస్తులు రూ. కోట్లల్లో దండుకుంటున్నారు.
ఇలా దేశవ్యాప్తంగా అమాయకులను సైబర్‌ నేరస్తులు టార్గెట్‌ చేస్తున్నారు. సైబర్‌ నేరస్తులు విచారణ పేరుతో బాధితుల పూర్తి వివరాలను సేకరించడంతో పాటే వారి ఇతర వివరాలన్నీ కరెక్ట్‌గా నేరస్తులు చెబుతుండటంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. విచారణకు సహకరించకపోతే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తామని బెదిరించడంతో నిజమైన పోలీసులుగా భావిస్తున్న బాధితులు వారు చెప్పినట్టు చేస్తున్నారు. ఓటీపీ తీసుకుని బ్యాంక్‌ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. బాధితులు ప్రశ్నిస్తే విచారణ పూర్తయిన తర్వాత మీ డబ్బులు తిరిగిస్తామంటూ సమాధానమిస్తున్నారు. ఈ తరహా మోసాలతో సైబర్‌ నేరస్తులు కోట్లలో కొల్లగొడుతున్నారు.
తెలియని కాల్స్‌లిఫ్ట్‌ చేయొద్దు
తెలియని నెంబర్ల నుంచి మెసేజ్‌లు, కాల్స్‌ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని ఇంటర్నేషనల్‌ కాల్స్‌ లిఫ్ట్‌ చేయవద్దని చెబుతున్నారు. కొందరు కేటుగాళ్లు విదేశీ కోడ్‌ నెంబర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి కాల్స్‌ పట్ల అలర్ట్‌గా ఉండాలని, మెసేజ్‌లు, స్పామ్‌ కాల్స్‌ వస్తే వెంటనే బ్లాక్‌ చేయాలని తెలిపారు. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోవటం కన్నా అప్రమత్తంగా ఉండటం ముఖ్యమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. సైబర్‌ నేరస్తుల బారినపడితే వెంటనే ‘1930’ ఆన్‌లైన్‌ నెంబర్‌కు కాల్‌ చేయాలని తెలిపారు.