‘ఆదర్శాలు కలిగి ఉండటం, విలువలకు కట్టుబడి నడుచుకోవడం, ప్రజాసేవ చేయడం మా లక్ష్యం’ అని చాలా మంది బాహాటంగా చెపుతారు. కాని ఆచరణలో వాటిని నిబద్ధతతో పాటించే వారు మచ్చుకు కొందరే. ఉదాహరణకు నీట్ ప్రవేశ ఫలితాలు వెలువడగానే కొంతమంది భావి వైద్య విద్యార్థులు తాము పేదలకు ఉచిత వైద్య సేవలందిస్తామని ప్రగల్భాలు పలుకుతారు. కాని ఆచరణలో డబ్బుకే ప్రాధాన్యతనిస్తారు. ఇలా ప్రతిరంగం గురించి చెప్పుకోవచ్చు. అయితే ఇందుకు భిన్నంగా ముందుకు సాగుతూ ఎందరికో స్ఫూర్తిదాయకంగాను, ఆదర్శవంతంగా నిలిచేవారు కూడా సమాజంలో అక్కడక్కడ తారసపడుతుంటారు. అప్పుడే వారి గొప్పతనం తెలుస్తుంది. తన నాలుగు నెలల జీతం అక్షరాల లక్ష రూపాయలు సీఎం కేసీఆర్ సమక్షంలో ‘ముఖ్యమంత్రి సహాయనిధి’కి అందించిన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన రుద్రరచన అందరికి ఆదర్శప్రాయురాలు. తనలాంటి ఎందరో అనాథ అభాగ్యులను ఆదుకోవాలనే సదుద్దేశంతో తాను ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసినట్లు ఆమె పేర్కొనడం ఆహ్వానించదగినది. మానవ సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలుగా కొనసాగుతున్న నేటి రోజుల్లో ఆమె చేసిన దాతృత్వం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. రుద్ర రచన చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి ఆనాథగా అనేక కష్టాల కడగండ్లలో కొట్టుమిట్టాడారు. ఆమె చదువు సజావుగా సాగడానికి అనేక విషమ పరిస్థితులను అధిగమించారు. ఒక దశలో ఇంజనీ రింగ్ కాలేజీ ఫీజులు, హాస్టల్ వసతి కోసం ఆమె అనేక అవస్థలు అధిగమించి చివరకు మంత్రి కేటీఆర్ సహాయంతో ఇంజనీరింగ్ విద్యని విజయవంతంగా పూర్తి చేసి ఐ.టి కంపెనీలో ఉన్నత ఉద్యోగాన్ని సాధించారు. తనలాగా ఎవరికి ఇబ్బంది రాకూడదని పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేయాలనే దృఢ సంకల్పంతో ఆర్థికసాయంతో ముందుకు రావడం అభినందనీయం. ఇలాంటి వాళ్లు సమాజంలో చాలా అరుదు. వారు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు. అందుకే రుద్రరచన నేటి యువతకు ఆదర్శం.
– జె.జె.సి.పి.బాబూరావు, సెల్:9493319690