బ్రతకాలి !

Survive!ఒక్క క్షణం…
బ్రతుక్కి చావుకి నడుమ
ఆగి ఆలోచించ గలిగితే
నూరేళ్ళ జీవితాన్ని నిలుపుకోగలం!
జీవితం మనిషికి మాత్రమే
దొరికిన అపురూప వరం
ఆవేశంలో, అనాలోచితంగా
బాధల గుప్పిట నలిగిపోతూ
అదృష్టంగా దొరికిన
జీవితాన్ని అర్ధాంతరంగా
ముగించాలనుకోవటం అవివేకం!
కరువు కోరలకు చిక్కి
పండిన పంటకు పెట్టుబడే రాక
దళారీ దగాకు తల్లడిల్లి
నూరేళ్ళ బ్రతుకును బలి
తీసుకుంటున్న రైతన్నలెందరో?
క్షణికావేశంలో అనాలోచితంగా
అల్ప సమస్యలకు ఆయువు వదిలే
అమాయకులు మరచిపోరానిది
సృష్టిలో మానవజన్మ
మనకు మాత్రమే దొరికిన గొప్ప వరమని
చిరు అపజయాలకే కృంగిపోయి
తమకు తామే వంచించుకుని
నమ్ముకున్న వారందరికీ
గుండెకోతను మిగులుస్తున్నారో?
విజయాలన్నీ అపజయాల
పునాదుల మీదనే
రెప రెపలాడతాయి
శోకాన మరుగున దాగి
కనిపించని సుఖమున్నట్టే
ధీరులై సాధించటమే
మానవ జన్మ సార్థకత!
జీవితం అందరికీ వడ్డించిన విస్తరికాదు!
అవకాశాలను వెతుక్కుంటూ
సాగితేనే చేరువవుతాయి
పోరాడితేనే విజయాన్ని సాధిస్తాం!
రాంక్‌ల పంటను ఎరవేసి
కోట్లు పండించే కార్పొరేట్‌ బడుల్లో
పసితనం కనుమరుగై
సృజనాత్మకత కుదేలై
విషవలలో చిక్కిన రేపటి తరానికి
జీవన నైపుణ్యాలను
బ్రతుకు విలువలను నేర్పరు!
తాము సాధించని విజయాల కోసం
అధిరోహించని శిఖరాలకు
పిల్లలను చేర్చాలనే అత్యాశతో
వారిని బలి చేస్తున్న
స్వార్థ అమ్మానాన్నలు ఎన్నడైనా
ఆ అమాయకపు గుండె వత్తిడిని
పసికట్టి ప్రేమగా అక్కున
చేర్చుకొని ఓదార్చకుంటే
అన్యాయంగా వారిని చేతులారా
మనమే పోగొట్టుకుంటాం!
వత్తిడితో దిక్కుతోచని
అభాగ్యులకు స్వాంతనను
స్నేహ హస్తాన్ని అందించి
వారి మనోవ్యధను పంచుకుని
జీవితమంటే ఆశను మళ్లీ
వారిలో చిగురింప చేద్దాం!
పిల్లల్ని మన తీరని కోర్కెలకోసం
సమిధలుగా మార్చక
సహజంగా వారిని
పువ్వులుగా వికసించనిద్దాం!
మనిషిగా మానవత్వపు
పరిమళాలను పులుముదాం!
ఆకలి చావులు విద్వేషపు హత్యలు
అంతటా ఎగిసిపడే మారణ కాండలు
రోగగ్రస్త వ్యవస్థకు దర్పణాలు!
లోకాన క్షణానికి ఓ బలవర్మరణం
మానవత్వానికి మాయని మచ్చ !
ఆత్మహత్యలు మచ్చుకైనా కానరాని
అందమైన ఆరోగ్యకర సమాజాన్ని
నిర్మించేందుకు కలిసి నడుద్దాం !
(మానసిక వత్తిడికి వరుసగా
ఆత్మహత్యలతో అన్యాయంగా
బలైపోతున్న వారిని తలచుకుని)
– డా|| కె. దివాకరాచారి, 9391018972