శనివారం రాజమహేంద్రవరంలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళుతున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22) ప్రమాదవశాత్తు మరణించారు.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిర్మాత దిల్‌రాజు మీడియా సమక్షంలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేం సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాలకు చెరో రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను’ అని అన్నారు.
అలాగే ఈ ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, హీరో పవన్‌కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన స్పందిస్తూ, ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ వేడుక నుంచి ఇళ్ళకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరం. ఇళ్ళకు సురక్షితంగా వెళ్ళండి అని ఆ రోజు వేడుకలో ఒకటికి,రెండు సార్లు చెప్పాను. ఈ ప్రమాదం నన్నెంతో బాధించింది. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థికసాయం అందిస్తాం. అలాగే ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ అధికారులకు స్పష్టం చేశాను’ అని తెలిపారు.
అభిమానుల మరణించడం పట్ల హీరో రామ్‌చరణ్ సైతం స్పందించారు. ఆయన కూడా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు.