సిక్సర్‌తో సెమీస్‌కు!

– సెమీఫైనల్లో టీమ్‌ ఇండియా
– ఇంగ్లాండ్‌పై ఘన విజయం
– రాణించిన రోహిత్‌, షమి
ఐసీసీ 2023 ప్రపంచకప్‌
టీమ్‌ ఇండియా ‘సిక్సర్‌’ కొట్టింది. ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో వరుసగా ఆరో విజయం సాధించింది. 2023 ఐసీసీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. లక్నోలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన ఆతిథ్య భారత్‌ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్‌ శర్మ (87), సూర్య కుమార్‌ (49) మెరుపులతో తొలుత భారత్‌ 229 పరుగులు చేయగా.. షమి, బుమ్రా, కుల్దీప్‌ త్రయం ఛేదనలో ఇంగ్లాండ్‌ను కట్టడి చేశారు. ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన భారత్‌.. ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
నవతెలంగాణ-లక్నో
అజేయ భారత్‌. ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియా ఓటమెరుగని జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం లక్నోలో ప్రపంచకప్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లాండ్‌ను భారత్‌ చిత్తు చేసింది. 100 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. 230 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్‌ 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. పేసర్లు మహ్మద్‌ షమి (4/22), బుమ్రా (3/32) సహా స్పిన్నర్‌ కుల్దీప్‌ (2/24) మాయ చేయటంతో ఇంగ్లాండ్‌ కుదేలైంది. లివింగ్‌స్టోన్‌ (27), మలన్‌ (16), డెవిడ్‌ విల్లే (16) ఆ జట్టులో టాప్‌ స్కోరర్లు. జో రూట్‌ (0), బెన్‌ స్టోక్స్‌ (0), జోశ్‌ బట్లర్‌ (10) చేతులెత్తేశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (87, 101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరువగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (49, 47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), కెఎల్‌ రాహుల్‌ (39, 58 బంతుల్లో 3 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత్‌ తొలి ఐదు విజయాలు ఛేదనలో సాధించగా.. ఈ మ్యాచ్‌లోనే లక్ష్యాన్ని కాపాడుకుని గెలుపొందారు. రోహిత్‌ శర్మ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.
ఇంగ్లాండ్‌ చతికిల
230 పరుగుల లక్ష్యం. ఆ పిచ్‌పై పెద్ద కష్టం కాదు. దీంతో ఇంగ్లాండ్‌కు ఓ విజయ అవకాశం దక్కిందనే అనుకున్నారు. కానీ బట్లర్‌సేనకు లక్ష్యం ఎంత చిన్నదైనా కొండగానే కనిపిస్తోంది!. పవర్‌ప్లేలో పేసర్లు బుమ్రా, షమి నిప్పులు చెరుగగా.. మిడిల్‌ ఓవర్లలో మాయగాళ్లు కుల్దీప్‌, జడేజా మ్యాజిక్‌ చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు కూల్చిన భారత బౌలర్లు ఇంగ్లాండ్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఆరంభంలో 30/0తో సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌ ఒక్కసారిగా 39/4తో పతనం అంచున నిలిచింది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (14), డెవిడ్‌ మలాన్‌ (16) తొలి వికెట్‌కు 30 పరుగులు జోడించారు. బుమ్రా వరుస బంతుల్లో విజృంభించటంతో ఇంగ్లాండ్‌కు కోలుకోలేని దెబ్బ పడింది. మలాన్‌ (16), జో రూట్‌ (0) వరుస బంతుల్లో అవుటయ్యారు. మహ్మద్‌ షమి సైతం తన బౌలింగ్‌లో వరుస బంతుల్లో వికెట్లు పడగొట్టాడు. బెన్‌ స్టోక్స్‌ (0) వికెట్లను గిరాటేసిన షమి.. జానీ బెయిర్‌స్టో (14)ను సైతం సాగనంపాడు. వరుసగా వికెట్లు పడగొట్టిన భారత్‌.. మ్యాచ్‌ను లాగేసుకుంది. కెప్టెన్‌ జోశ్‌ బట్లర్‌ (10), లియాం లివింగ్‌స్టోన్‌ (27)లు కుల్దీప్‌ మాయలో పడ్డారు. క్రిస్‌ వోక్స్‌ (10) జడేజా ఓవర్లో స్టంపౌట్‌గా నిష్క్రమించాడు. 98 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌.. ఆ తర్వాత ఓటమి అంతరం తగ్గించుకునేందుకు పోరాడింది.
రాణించిన రోహిత్‌, సూర్య పేస్‌కు అనుకూలించే పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్‌ ఇండియాకు ఇంగ్లాండ్‌ పేసర్లు షాక్‌ ఇచ్చారు. 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌.. కష్టాల్లో కూరుకుంది. పవర్‌ప్లేలో పేసర్లు క్రిస్‌ వోక్స్‌, డెవిడ్‌ విల్లే పరుగుల నియంత్రణతో ఒత్తిడి పెంచగా.. స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ మాయ చేశాడు. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (9), విరాట్‌ కోహ్లి (0), శ్రేయస్‌ అయ్యర్‌ (4) విఫలమయ్యారు. విరాట్‌ కోహ్లి పరుగుల ఖాతా తెరువకుండానే నిష్క్రమించగా.. వోక్స్‌ పేస్‌కు అయ్యర్‌, గిల్‌ పడిపోయారు. ఈ పరిస్థితుల్లో రోహిత్‌ శర్మ (87) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. కెఎల్‌ రాహుల్‌ (39)తో కలిసి నాల్గో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. 14.2 ఓవర్లలో 50 పరుగుల మార్క్‌ చేరిన భారత్‌.. ఆ తర్వాత ఏ దశలోనూ రన్‌రేట్‌ పుంజుకోలేదు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 66 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన రోహిత్‌ శర్మ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. కెఎల్‌ రాహుల్‌ సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. లక్నో పిచ్‌పై మంచి అవగాహన కలిగిన రాహుల్‌.. మూడు ఫోర్లతో మెరిశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (49) జట్టులో స్థానానికి న్యాయం చేశాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. పది ఫోర్లు, 3 సిక్సర్లతో స్పీడ్‌ పెంచిన రోహిత్‌ శర్మ.. శతకానికి 13 పరుగుల దూరంలో వికెట్‌ కోల్పోయాడు. మరో ఎండ్‌లో సూర్య నిలువటంతో భారత్‌ 260 పరుగులైనా చేసేలా కనిపించింది. కానీ రవీంద్ర జడేజా (8) వికెట్‌తో ఆ ఆశలు ఆవిరయ్యాయి. నాలుగు ఫోర్లు, ఓ సిక్స్‌ బాదిన సూర్య అర్థ సెంచరీ ముంగిట వికెట్‌ చేజార్చుకున్నాడు. టెయిలెండర్లలో జశ్‌ప్రీత్‌ బుమ్రా (16), కుల్దీప్‌ యాదవ్‌ (9 నాటౌట్‌) రాణించారు. బుమ్రాతో కలిసి సూర్య 25 పరుగులు జోడించగా.. కుల్దీప్‌తో కలిసి బుమ్రా 21 పరుగులు సాధించాడు. దీంతో భారత్‌ 50 ఓవర్లలో 229 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో డెవిడ్‌ విల్లే (3/45) మూడు వికెట్లు పడగొట్టగా.. క్రిస్‌ వోక్స్‌ (2/33), ఆదిల్‌ రషీద్‌ (2/35) రాణించారు.
2
ఐసీసీ ప్రపంచకప్‌ చరిత్రలో తొలి పది ఓవర్లలోనే టాప్‌-4 బ్యాటర్లలో ముగ్గురు క్లీన్‌బౌల్డ్‌ కావటం ఇది రెండోసారి. ఇంగ్లాండ్‌ 9.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయింది. 2007లో వెస్టిండీస్‌, జింబాబ్వే మ్యాచ్‌లోనూ టాప్‌లో ముగ్గురు బ్యాటర్లు బౌల్డయ్యారు.
18000
రోహిత్‌ శర్మ 18000 (మూడు ఫార్మాట్లు)పరుగుల క్లబ్‌లో చేరాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ (477వ ఇన్నింగ్స్‌) ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో 3677, టీ20ల్లో 3853, వన్డేల్లో 10470 పరుగులు బాదాడు. సచిన్‌, ద్రవిడ్‌, గంగూలీ, కోహ్లి తర్వాత 18 వేల పరుగులు చేసిన ఐదో భారత క్రికెటర్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు.
భారత్‌ ఇన్నింగ్స్‌ : రోహిత్‌ శర్మ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) రషీద్‌ 87, శుభ్‌మన్‌ గిల్‌ (బి) క్రిస్‌ వోక్స్‌ 9, విరాట్‌ కోహ్లి (సి) బెన్‌ స్టోక్స్‌ (బి) డెవిడ్‌ విల్లే 0, శ్రేయస్‌ అయ్యర్‌ (సి) మార్క్‌వుడ్‌ (బి) క్రిస్‌ వోక్స్‌ 4, కెఎల్‌ రాహుల్‌ (సి) బెయిర్‌స్టో (బి) డెవిడ్‌ విల్లే 39, సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) క్రిస్‌ వోక్స్‌ (బి) డెవిడ్‌ విల్లే 49, రవీంద్ర జడేజా (ఎల్బీ) రషీద్‌ 8, మహ్మద్‌ షమి (సి) బట్లర్‌ (బి) మార్క్‌వుడ్‌ 1, జశ్‌ప్రీత్‌ బుమ్రా రనౌట్‌ 16, కుల్దీప్‌ యాదవ్‌ నాటౌట్‌ 9, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం : (50 ఓవర్లలో 9 వికెట్లకు) 229.
వికెట్ల పతనం : 1-26, 2-27, 3-40, 4-131, 5-164, 6-182, 7-183, 8-208, 9-229.
బౌలింగ్‌ : డెవిడ్‌ విల్లే 10-2-45-3, క్రిస్‌ వోక్స్‌ 9-1-33-2, ఆదిల్‌ రషీద్‌ 10-0-35-2, మార్క్‌వుడ్‌ 9-1-46-1, లివింగ్‌స్టోన్‌ 4-1-29-0, మోయిన్‌ అలీ 8-0-37-0.
ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ : జానీ బెయిర్‌స్టో (బి) మహ్మద్‌ షమి 14, డెవిడ్‌ మలాన్‌ (బి) బుమ్రా 16, జో రూట్‌ (ఎల్బీ) బుమ్రా 0, బెన్‌ స్టోక్స్‌ (బి) మహ్మద్‌ షమి 0, జోశ్‌ బట్లర్‌ (బి) కుల్దీప్‌ యాదవ్‌ 10, మోయిన్‌ అలీ (సి) రాహుల్‌ (బి) మహ్మద్‌ షమి 15, లియాం లివింగ్‌స్టోన్‌ (ఎల్బీ) కుల్దీప్‌ యాదవ్‌ 27, క్రిస్‌ వోక్స్‌ (స్టంప్డ్‌) రాహుల్‌ (బి) జడేజా 10, డెవిడ్‌ విల్లే నాటౌట్‌ 16, ఆదిల్‌ రషీద్‌ (బి) మహ్మద్‌ షమి 13, మార్క్‌వుడ్‌ (బి) బుమ్రా 0, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం : (34.5 ఓవర్లలో ఆలౌట్‌) 129.
వికెట్ల పతనం : 1-30, 2-30, 3-33, 4-39, 5-52, 6-81, 7-98, 8-98, 9-122, 10-129.
బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 6.5-1-32-3, మహ్మద్‌ సిరాజ్‌ 6-0-33-0, మహ్మద్‌ షమి 7-2-22-4, కుల్దీప్‌ యాదవ్‌ 8-0-24-2, రవీంద్ర జడేజా 7-1-16-1.