– నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 52 మంది
– 12 జిల్లాల్లో 4.63 లక్షలకుపైగా ఓటర్లుొ రాజకీయ పార్టీల ప్రచారం ముమ్మరం
– బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ సభలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయో లేదో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లకు తెరలేచింది. ఈనెల 27వ తేదీన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల శాసన మండలి స్థానానికి పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి.. జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికకావడంతో ఖాళీ ఏర్పడింది. దాంతో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాలనే పట్టుదలతో బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. క్రితంసారి ఎన్నికల్లో రాజేశ్వరరెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్‌కుమార్) ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి అందివచ్చిన అవకాశాన్ని ‘చే’జిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల్లో నాలుగో స్థానానికి పరిమితమైన బీజేపీ ఈ సారి గెలుపు కోసం ఆశలు పెంచుకుంది.
12 జిల్లాలు.. 4.63 లక్షల ఓటర్లు..
ఈ నియోజకవర్గం పరిధిలో సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జె.భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ.. మొత్తం 12 జిల్లాలు ఉన్నాయి. 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,88,189 మంది పురుషులు, 1,75,645 మంది మహిళలు, ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు. అత్యధికంగా ఖమ్మంలో 83,879 మంది ఓటర్లు ఉండగా ఆ తర్వాత నల్లగొండలో 80,087 మంది ఓటర్లు ఉన్నారు. వరంగల్, హన్మకొండలో 43వేల పైచిలుకు, భద్రాద్రి కొత్తగూడెంలో 40వేలకు పైన, మహబూబాబాద్, భువనగిరిలో 34వేలకు పైన ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా సిద్దిపేటలో 4,679 మంది ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు 52 మంది పోటీ చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్‌పై ఎలాంటి సింబల్స్ లేకుండా పార్టీ, అభ్యర్థి పేర్లు మాత్రమే ఉంటాయి.
ప్రాధాన్యత ఓటు ఆధారంగా రిజల్ట్స్ కాబట్టి ఎన్నికల ఫలితాలు తేలేందుకు మూడు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది.
కారు, కాంగ్రెస్ జోరుగా ప్రచారం..
ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. ఎంపీ ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు దీటుగా బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి సైతం ప్రచారం చేపట్టారు. మల్లన్న తరపున ఏ జిల్లాకు ఆ జిల్లా మంత్రులు ప్రచారం నిర్వహిస్తుండగా.. బీఆర్‌ఎస్ అభ్యర్థి కోసం కేటీఆర్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చెమటోడుస్తున్నారు. కాంగ్రెస్ నిరుద్యోగులు, ఉద్యోగులను బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాటు వంచించిన విధానాన్ని ప్రచార సభల్లో ఏకరువు పెడుతుంది. బీఆర్‌ఎస్ ఆర్నెళ్ల పాలనలో కాంగ్రెస్ రిక్త’హస్త’మే చూపిందని విమర్శిస్తున్నది. నోటిఫికేషన్లు, పేపర్ లీకేజీలు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అంశాలను కాంగ్రెస్ లేవనెత్తుతుండగా.. బీఆర్‌ఎస్ కూడా ఇదే అంశాలను విశ్లేషిస్తూ కాంగ్రెస్ ఆర్నెళ్లలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న వ్యక్తిగత జీవితంలో లోపాలను బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రస్తావిస్తున్నారు. అదే క్రమంలో తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాకేశ్‌రెడ్డి నేపథ్యాన్ని రైతు కుటుంబం, ఐటీ ఉద్యోగాలను వదిలి అమెరికా నుంచి ప్రజాసేవ చేసేందుకు వచ్చారని వివరిస్తున్నారు.
ప్రచారం మాత్రం జోరుగా సాగుతుండగా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైనా ఇరు పార్టీల అంచనాలు బలంగా ఉన్నాయి. ఇంతకూ పట్టభద్రులు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.