నేడు ఢిల్లీ సీఎంగా అతిశి

Today, Atishi is the CM of Delhi– ఐదుగురు మంత్రులు సహా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత, ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమితులైన అతిశి మర్లెనా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే ఆమెతో పాటు ఐదుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా అతిశి, మంత్రులుగా సౌరభ్‌ భరద్వాజ్‌, గోపాల్‌ రారు, ఇమ్రాన్‌ హుస్సేన్‌, కైలాష్‌ గహ్లౌట్‌, ముఖేష్‌ అహ్లావత్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అధికారక నివాస అధికారి వెల్లడించారు. అయితే, ఏడో మంత్రి ఎవరనేది అస్పష్టంగానే ఉందని తెలిపారు. ఆప్‌ నేత ఒక క్యాబినెట్‌ స్థానం ఖాళీగా ఉంటుందని ధృవీకరించారని, దాని వెనుక కారణాలను ఆయన వెల్లడించలేదన్నారు.
అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఆప్‌ నేతలు గోపాల్‌ రారు, కైలాష్‌ గెహ్లాట్‌, సౌరభ్‌ భరద్వాజ్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌లను కొనసాగించడంతో పాటు కొత్తగా కొత్త సుల్తాన్‌పూర్‌ మజ్రా ఎమ్మెల్యే ముఖేష్‌ అహ్లావత్‌కు కేబినెట్‌లో స్థానం కల్పించారు. ఢిల్లీ కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రి అతిశి మర్లెనాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్‌ శాసనసభ్యులు సెప్టెంబర్‌ 17న ఏకగ్రీవంగా ఎన్నుకున్నది తెలిసిందే.
ఆప్‌ ప్రభుత్వంలో ఎక్కువ శాఖలను కలిగి ఉన్న కల్కాజీ ఎమ్మెల్యే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెలరోజులు మిగిలి ఉండగానే పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు బెయిల్‌పై కేజ్రీవాల్‌ తన రాజీనామాను ప్రకటించిన తరువాత ఢిల్లీ ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి అనేక పేర్లు ప్రతిపాదనలోకి వచ్చినప్పటికీ కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియా అరెస్టుల తరువాత పార్టీలో ప్రధాన పాత్ర పోషించిన అతిశికి సిఎం పదవి దక్కింది.మరోవైపు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌కు ప్రభుత్వ వసతిని అభ్యర్థిస్తూ సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తామని ఆప్‌ రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా విలేకరుల సమావేశంలో ప్రకటించారు. కేజ్రీవాల్‌ తన సూత్రాల ఆధారంగా రాజీనామా చేయాలని ఎంచుకున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే అధికారిక నివవాసాన్ని ఖాళీ చేయనున్నారని తెలిపారు. ఆయనకు ఎటువంటి ఆస్తి, సొంత ఇల్లు లేదని, ఒక జాతీయ పార్టీ కన్వీనర్‌గా ఆయన ప్రభుత్వ వసతికి అర్హులని, దానిని అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామని ఆయన వెల్లడించారు.