నేడు కాంగ్రెస్‌ రెండో జాబితా..!

Congress's second list today..!– తెలంగాణలో 60 స్థానాలపై స్పష్టత
– వామపక్ష పార్టీలతో పొత్తు గురించి సీఈసీ భేటీలో చర్చ
– మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఖరారు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) బుధవారం భేటీ కానుంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా… ఈ నెల 15న 55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల చేసింది. మిగిలిన 64 స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై ఇటీవల రెండుసార్లు భేటీ అయిన స్క్రీనింగ్‌ కమిటీ అభ్యర్థుల ప్రతిపాదనలకు సిద్ధం చేసింది. ఇందులో వామపక్ష పార్టీలతో పొత్తు, వారికి కేటాయించే నాలుగు సీట్లు, మిగిలిన 60 స్థానాలపై స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ ప్రతిపాదనలను బుధవారం ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, ఇతర నేతల సమక్షంలో జరిగే సీఈసీలో చర్చించి, ఆమోదించనున్నారు. అనంతరం తుది జాబితా
విడుదల కానుంది. ఒకవేళ బుధవారం సమావేశం ముగియడం ఆలస్యం అయితే, గురువారం సీఈసీ ఆమోదించిన అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. కాగా రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి నిజామాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలకు చెందిన పలువురు నేతలు నేడు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. కొత్తగా పార్టీలో చేరే వీరి కోసం 4-5 స్థానాలను కేటాయించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం స్క్రీనింగ్‌ కమిటీ రూపొందించిన తుది జాబితాలో స్వల్ప మార్పులు, చేర్పులు జరుగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.