మొన్నటిదాకా అయోధ్య, బాబ్రీ మసీదు, రామమందిరం…! ఆ వివాదం ముగిసిందో లేదో వారణాసి, జ్ఞానవాపి మసీదు, విశ్వేశ్వరాలయం…!! తాజాగా ఆ జాబితాలో రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ చేరింది. అసలీ దేశంలో ఇవి తప్ప ఇంతకు మించిన సమస్యలే లేవా? అంతులేని అసమానతలు, అదుపులేని ధరలు, అంతకుమించిన ఆకలి, నిరుద్యోగంతో ప్రజాజీవితం అంతకంతకూ అగాథంలోకి జారుతుంటే, ఇవేవీ కనీస చర్చకు నోచుకోకపోవడం వైచిత్రి! మన ప్రయాణం ఏవైపునకు సాగుతుందో తెలుసుకోడానికి ఇంతకంటే ఉదాహరణలేం కావాలి? పాలకులు మనుషుల్ని మతాలుగా చీల్చేస్తున్నారు. 2024 ఎన్నికల ముందు జ్ఞనవాపి వివాదం తెరమీదికి వచ్చింది. త్వరలో మరి కొన్ని రాష్టాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అజ్మీర్ షరీఫ్ దర్గా శివాలయం అన్న అర్జీ దాఖలైంది. రాజస్థాన్ కోర్టు ఆ పిటిషన్ విచారించడానికి అంగీకరించింది. దర్గా కమిటీకి, భారతీయ పురాతత్వశాఖకు, మైనారిటీశాఖకు సైతం నోటీసు లు జారీ చేసింది. సర్వే చేయించడానికి సిద్ధపడింది. ప్రజల భావోద్వేగాలతో చెలగాట మాడటం, వారి నెత్తుటి ధారలతో పీఠాలకు బాటలు వేసుకోవడం ఈ పాలకులకు కొత్తేమీకాదు గానీ, ఈ ఉన్మత్త రాజకీయాల పట్ల ప్రజల ఉదాసీనతే అవాంఛనీయం. న్యాయస్థానాలు కూడా ఇది గుర్తించక పోవడం ఆందోళనాకరం. అందుకే కండ్లకు కాషాయం పులిమి మరీ సామరస్యాన్ని కూల్చేస్తున్నారు.
అజ్మీర్ షరీఫ్ ఖాజా మొయినుద్దీన్ చిష్టీ దర్గా కింద దేవాలయం ఉందని మధ్యాహ్నం అర్జీ దాఖలు చేస్తే వెంటనే కోర్టు దాన్ని విచారణకు స్వీకరిస్తుంది. పురాతతత్వ శాఖ సర్వే ప్రారంభిస్తుంది. కానీ, ముస్లింలపై దాడులు, మూక హత్యలు గత పదేండ్ల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. వీటి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇది సంఫ్‌ు పరివార్ ఎజెండా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అజ్మీర్ దర్గా కింద శివాలయం ఉందన్న వాదన మూడేండ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. ప్రకటనల మీద ప్రకటనలు జారీ చేస్తూనే ఉన్నారు. అజ్మీర్ షరీఫ్ దర్గా దాదాపు 400 ఏండ్ల నుంచి ఉంది. అన్ని మతాలవారు ఈ దర్గా సందర్శిస్తారు. ఒక రకంగా దర్గాలు భిన్నత్వంలో ఏకత్వానికి తార్కాణం. ఈ దర్గాను ”సంకట్ మోచన్ మహాదేవ్” దేవాలయంగా ప్రకటించాలని హిందూ సేనకు చెందిన విష్ణు గుప్తా పిటిషన్ దాఖలు చేశారు. సదరు విష్ణు గుప్తాకు దర్గా కింది హరిహర దేవాలయం ఉన్నట్టు కల వచ్చిందట. ఆ కల ఆధారంగా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. విజ్ఞత గల కోర్టు దాన్ని విచారించ డానికి అంగీకరించడం విషాదం.
ఇందులో విష్ణు గుప్తా మత రాజకీయ చదరంగంలో చిన్నపావు కావొచ్చు. దీని వెనక పెద్ద ప్రణాళిక ఉందనడం మాత్రం సత్యం. ఈ దర్గాకు సంబంధించిన రిజిస్ట్రేషన్లన్నింటీ రద్దు చేయాలని కూడా అభ్యర్థించారు. ఈ దర్గా పర్యవేక్షణ ప్రధాన ద్వారం హిందూ వాస్తుశాస్త్రానికి అనుగుణంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. సంభాల్లో ఇటీవలే మత కలహాలు జరిగాయి. అక్కడ కూడా వివాదం మసీదు కింద మందిరం ఉందనేదే.
అయితే, ఇలాంటి పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోగలిగిన కోర్టులు, 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని మాత్రం విస్మరించడం విడ్డూరం! 1947 ఆగస్టు 15నాటికి దేశంలోని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాలన్నీ ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలి తప్ప వాటిలో ఎలాంటి మార్పులకు, వివాదాలకు చోటివ్వరాదని నిర్దేశిస్తుందీ చట్టం. ఇప్పుడు అలాంటి వాటి గురించే వివాదాలు లేవనెత్తుతూ పిటిషన్లు దాఖలు చేస్తే వాటిని విచారణకు స్వీకరించడం ఆ చట్టాన్ని ఉల్లంఘించడమేనని జడ్జీలకు ఎందుకు తట్టదో అంతుపట్టదు. 1991 నాటి చట్టాన్ని ఉల్లంఘిస్తే మూడేండ్లు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం చట్టంలోనే ఉంది. అర్జీలు పెటుకున్నవారికి, వాటిని విచారించిన జడ్జీలకు ఈ చట్టం కింద శిక్ష పడ్డ దాఖలాలు ఎక్కడా లేవు.
హిందూ రాజులే హిందూ దేవాలయాలను కొల్లగొట్టిన సందర్భాలు కూడా కోకొల్లలు. ఈ దేశంలో దేవాలయాల విధ్వంసం ఓ కాదనలేని చారిత్రక సత్యం. ఇందుకు ఏ మతానికీ మినహాయింపు లేదు. అదే సమయంలో ఈ విధ్వంసాలు, మత విద్వేషాలు మధ్యయుగాల నాటి అజ్ఞానానికీ, అనాగరికానికీ, రాజ్యవిస్తరణ కాంక్షకూ ప్రతీకలు అనడం కూడా అంతే వాస్తవం. కానీ ఈ తరతరాల మూఢత్వాన్నీ మూర్ఖత్వాన్నీ ఛేదించుకుని శాంతీ, సహజీవనం, సామరస్యాలను సాధించింది పరిణామం. వీటిని కాపాడు కోవడం, మరింత ముందుకు తీసుకుపోవడం నేటి ఆధునిక సమాజ లక్ష్యాలు కావాలి తప్ప, తిరోగమనంలోకి నడవడం కాదు కదా..?!