– రాష్ట్ర ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పగలూ రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించేది లేదనీ, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోబోమని స్పష్టం చేశారు. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించనున్నట్టు తెలిపారు. అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ”స్వేద పత్రం” అనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు.