నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-1 దరఖాస్తుల సవరణ ప్రక్రియ గడువు బుధవారం సాయంత్రం ఐదుగంటలతో ముగియనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్-1 దరఖాస్తుల సవరణ ప్రక్రియ ఈనెల 23 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సవరణ గడువు ముగిసిన తర్వాత పొడిగింపు ఉండబోదని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఎలాంటి సవరణలకు అవకాశం లేదనీ, దరఖాస్తుల్లోని సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తామని వివరించారు. ఈ ప్రక్రియ మానవుల ప్రమేయం ఉండబోదని తెలిపారు. గ్రూప్-1 దరఖాస్తుల సవరణకు టీఎస్‌పీఎస్సీ(www.tspsc.gov.in) వెబ్‌సైట్‌ను ఉపయోగించాలని సూచించారు. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1కు 4.03 లక్షల దరఖాస్తులొచ్చాయి. గ్రూప్-1 ప్రిలిమినరీ రాతపరీక్షను జూన్ తొమ్మిదిన, మెయిన్స్ రాతపరీక్షను అక్టోబర్ 21న నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.