– కమలా హారిస్ అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన
– గాజాలో కాల్పుల విరమణ, అబార్షన్ హక్కుల కోసం ప్రదర్శనకు వేలాదిమంది సిద్దం
చికాగో: డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ సోమవారం చికాగోలో ప్రారంభం కానుంది. ఇందుకోసం అమెరికా నలుమూలల నుంచి పార్టీ ప్రతినిధులు, అధికారులు ఇప్పటికే చికాగో చేరుకున్నారు. ఈ కన్వెన్షన్ గురువారం వరకూ జరగనుంది. ఈ కన్వెన్షన్‌లోనే అధ్యక్ష ఎన్నికల కోసం కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి జోబైడెన్ అనూహ్యంగా తప్పుకున్న తరువాత నుంచి కమలా హారీస్‌కే పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. దీన్ని ఈ కన్వెన్షన్‌లో అధికారంగా ప్రకటించనున్నారు. మరోవైపు కన్వెన్షన్ కోసం ఉద్యమకారులు కూడా ఎదురుచూస్తున్నారు. గాజాలో కాల్పుల విరమణ, అబార్షన్ హక్కుల రక్షణ, అర్థిక అసమానతలు వంటి అంశాలపై భారీ సంఖ్యలో ఉద్యమకారులు ఆందోళనలు నిర్వహిస్తారనే అంచనాలు ఉన్నాయి. జులైలో మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ నుంచి తాము చాలా పాఠాలు నేర్చుకున్నామని, ఈ పాఠాలతో చికాగోలో భారీఎత్తున, బలమైన ప్రదర్శనలు జరుపుతామని ఉద్యమకారులు చెబుతున్నారు. కన్వెన్షన్ సాగే ప్రతిరోజూ తమ ప్రదర్శనలు కూడా ఉంటాయని తెలిపారు.