నేడే ఎన్నికల నగారా

Today is the election city–  543 లోక్‌సభ స్థానాలు, నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల
– ఏడు దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
18వ లోక్‌సభతో పాటు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఇందుకు సంబంధించి నేడు(శనివారం) షెడ్యూల్‌ విడుదల కానుంది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కొత్త ఈసీలు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, జ్ఞానేష్‌ కుమార్‌తో కలిసి, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒరిస్సా, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌కు విభజన, ఆర్టికల్‌ 370 రద్దు తరువాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 175, ఒరిస్సాలో 147, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరగబోతున్నా యి. అలాగే ఇటీవల మరణించిన, ఇతర కారణాలతో దేశ వ్యాప్తంగా ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాల్లోని సీట్లకు ఉప ఎన్నికలు ప్రకటించే అవకాశమున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే నందిత లాస్య మరణంతో ఖాళీ అయిన తెలంగాణలోని కంటోన్మెంట్‌ సీటుకు కూడా షెడ్యూల్‌ ప్రకటిం చే ఆస్కారం ఉంది. కాగా ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి కసరత్తు పూర్తి చేశారు. దీని ఆధారంగా ఈ నెల 13నే షెడ్యూ ల్‌ విడుదల చేయాలని ఈసీఐ ముందుగా భావించింది. అయితే గత ఫిబ్రవరి 14న ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. మరోవైపు మార్చి 8న అన్యూహ్యంగా మరో కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ కేంద్ర ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌పై ప్రభావం పడింది. అయితే తాజాగా ఖాళీ అయిన రెండు ఈసీ స్థానాలను కేంద్రం భర్తీ చేయడం, వారిద్దరూ బాధ్యతలు స్వీకరించడంతో షెడ్యూల్‌కు లైన్‌ క్లియరైంది.
గతంలో మాదిరిగానే ఏడు దశల్లో ఎన్నికలు
2019లో సార్వత్రిక ఎన్నికల కోసం మార్చి 10న ఈసీఐ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే ఈసారి దాదాపు వారం రోజులు ఆలస్యంగా షెడ్యూల్‌ విడుదలవుతోంది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిసింది. మొదటి దశ ఏప్రిల్‌ 11, రెండో దశ ఏప్రిల్‌ 18, మూడో దశ ఏప్రిల్‌ 23, నాలుగో దశ ఏప్రిల్‌ 29 , ఐదో దశ మే 6, ఆరో దశ మే 12, ఏడో దశ మే 19న ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు ఫలితాలు మాత్రం మే 23న వెల్లడించారు. ఇందులో మొదటి దశలోనే తెలంగాణ, ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఈసారి కూడా తొలి దశలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలను ముగించే అవకాశం ఉంది. కాగా 2014లో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగానే ఏపీ, తెలంగాణలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే 2018లో కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లడంతో… తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మార్పులు వచ్చాయి. దీంతో ఈసారి ఏపీ రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరగనున్నాయి.
నూతన ఈసీల బాధ్యతల స్వీకరణ
కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)లో నూతన ఎలక్షన్‌ కమిషనర్లుగా(ఈసీ) మాజీ ఐఏఎస్‌ అధికారులు సుఖ్‌ బీర్‌ సింగ్‌ సంధూ, జ్ఞానేశ్వర్‌ కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. వీరిద్దరిని నూతన ఈసీలుగా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ గురువారం రాత్రి గెజిట్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయమే నిర్వచన్‌ సదన్‌ లో నూతన ఈసీలుగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌, నిర్వాహణ, దశల వారీ ఎన్నికల తేదీలు, ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను శనివారం విడుదల చేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.