నేడే రెండో విడత పోలింగ్‌

– 13 రాష్ట్రాలు, 88 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు
– 1,202 మంది అభ్యర్థులు
-15.88 కోట్ల ఓటర్లు, 1.67 లక్షల పోలింగ్‌ కేంద్రాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ రెండో విడత ఎన్నికల పోలింగ్‌ నేడు జరగనుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై రాత్రి ఆరు గంటలకు ముగియనుంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. అందులో 73 జనరల్‌, తొమ్మిది ఎస్సీ, ఆరు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1,202 మంది అభ్యర్థులు పోటీ చేయను న్నారు. వారిలో 1,098 మంది అభ్యర్థులు పురుషులు కాగా, 102 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌ జండర్స్‌ ఉన్నారు. మొత్తం 15.88 కోట్ల ఓటర్లు ఉన్నారు. అందులో 8.08 కోట్లు పురుషులు, 7.8 కోట్లు మహిళలు, 5,929 మంది ట్రాన్స్‌ జండర్‌ ఓటర్లు ఉన్నారు. 34.8 లక్షల మంది ఓటర్లు మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలోనూ 3.28 కోట్ల ఓటర్లు 20 నుంచి 29 మధ్య వయస్సు గలవారు ఉన్నారు. 14.78 లక్షల మంది 85 ఏండ్ల పైబడిన వృద్ధులుండగా, 42,226 మంది వందేండ్ల పైడిన వృద్ధులున్నారు. 14.7 లక్షల మంది వికలాంగ ఓటర్లు ఉన్నారు. 1.67 లక్షల పోలింగ్‌ స్టేషన్లుండగా, 16 లక్షల మంది పోలింగ్‌ అధికారులు బాధ్యతలు నిర్వహించనున్నారు. 251 పరిశీలకులు బాధ్య తలు నిర్వహిస్తారు. భద్రతా సిబ్బంది కోసం మూడు హెలికాప్టర్లు, నాలుగు ప్రత్యేక రైళ్లు, దాదాపు 80 వాహనాలు ఉపయోగిం చనున్నారు. 50 శాతంపైగా (లక్షకు పైగా) పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
ఏ రాష్ట్రంలో, ఎన్ని స్థానాల్లో పోలింగ్‌
కేరళలోని మొత్తం 20 స్థానాలకు, కర్నాటకలోని 14, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌లలో 8 స్థానాల చొప్పున, మధ్యప్రదేశ్‌లో 7, అసోం, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌ లలో 3, త్రిపుర, జమ్మూ కాశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్‌ జరగనుంది. మణిపూర్‌లోనూ పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ విడతలో వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలు బరిలో ఉన్నారు. రాహుల్‌ గాంధీ, శశి థరూర్‌, అరుణ్‌ గోవిల్‌లు వంటి అనేక మంది కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగారు. బీజేపీ నుంచి హేమమాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్‌ షెకావత్‌ పోటీలో ఉన్నారు. సీపీఐ(ఎం) నుంచి శైలజ టీచర్‌, ఎలమారం కరీం, థామస్‌ ఐజాక్‌ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన సీపీఐకి అభ్యర్థి అన్నీ రాజా, బీజేపీ అభ్యర్థి కె సురేంద్రన్‌తో తలపడనున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ తిరువనంతపురం సీటును నాలుగోసారి నిలబెట్టుకోవాలని కష్టపడుతున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, సీపీఐ నుంచి పన్నయన్‌ రవీంద్రన్‌ అదే సీటు నుంచి పోటీలో ఉన్నారు.
2014 నుంచి మథుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హేమమాలిని బీజేపీి అభ్యర్థిగా కాంగ్రెస్‌ నేత ముఖేష్‌ ధన్‌గర్‌పై పోటీ చేస్తున్నారు. కోటా నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా, కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రహ్లాద్‌ గుంజాల్‌తో తలపడుతున్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ జోధ్‌పూర్‌ స్థానం నుంచి మూడోసారి విజయం సాధించాలని చూస్తున్నారు. బెంగళూరు సౌత్‌ సిట్టింగ్‌ ఎంపీ, భారతీయ జనతా యువమోర్చా (బీజెవైఎం) జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, కాంగ్రెస్‌ అభ్యర్థి సౌమ్యారెడ్డితో తలపడనున్నారు. ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత భూపేష్‌ బఘేల్‌ గత 30 ఏండ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న రాజ్‌నంద్‌గావ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేత వీరేంద్ర కుమార్‌ ఖాటిక్‌ తికమ్‌గఢ్‌లో బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి పంకజ్‌ అహిర్వార్‌ రంగంలోకి దిగారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ అలప్పుజ సీటులో పోటీకి దిగారు. సీపీఐ(ఎం) నుంచి ఎంపీ ఎఎం ఆరీఫ్‌ బరిలోకి దిగారు. త్రిస్సూర్‌లో కాంగ్రెస్‌కు చెందిన కె మురళీధరన్‌, సీపీఐకి చెందిన వీఎస్‌ సునీల్‌ కుమార్‌పై నటుడు, బీజేపీ తరపున సురేష్‌ గోపి పోటీలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బలూర్‌ఘాట్‌ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న సుకాంత మజుందార్‌ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇలా వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలు రెండో విడత పోరులో తలపడను న్నారు. ఏప్రిల్‌ 19న దేశంలోని 102 స్థానాలకు తొలి దశ ఎన్నికలు జరగ్గా.. 65.5 శాతం పోలింగ్‌ నమోదైంది.