నేడు కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ ఉద్యోగుల చలో ఎస్పీడీ కార్యాలయం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ (యూఆర్‌ఎస్‌), సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్‌ పే ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం చలో ఎస్పీడీ కార్యాలయం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేజీబీవీల్లో గత 20 ఏండ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలని, వారి సర్వీసులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ సిఫారసు చేసిన విధంగా ఏడాదికి రూ.1000 వార్షిక పెంపు, రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా సెలవులు మంజూరు చేయాలని కోరారు. ఈ అంశాలపై అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో చలో ఎస్పీడీ కార్యాలయ కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయించామని తెలిపారు.