భారత చరిత్రను కాపాడాల్సిన బాధ్యత.. నేటి చరిత్రకారులదే

today's historians– న్యూఢిల్లీ జేఎన్‌యూ చరిత్ర విభాగ విశ్రాంత ఆచార్య మృధులా ముఖర్జీ
– కేయూలో ప్రారంభమైన 82వ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ సమావేశాలు
నవతెలంగాణ-హసన్‌పర్తి
భారతదేశ చరిత్రను కాపాడాల్సిన బాధ్యత నేటి చరిత్రకారులపై ఉందని న్యూఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ చరిత్ర విభాగం విశ్రాంత అచార్యులు మృధులా ముఖర్జీ అన్నారు. 82వ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ సమావేశాలు.. డిసెంబర్‌ 28 నుంచి 30వ తేదీ వరకు కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో వీసీ ఆచార్య తాటికొండ రమేష్‌ అధ్యక్షతన గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. నిజాన్ని రక్షించాలని, సెక్యులర్‌, సోషలిస్ట్‌, ప్రజాస్వామ్య మౌలిక భావనలను కాపాడుకోవాలని తెలిపారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో భారత దేశ చారిత్రక మూలాలు దెబ్బ తినకుండా భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత చరిత్రకారుల భుజస్కంధాలపై ఉందన్నారు. 1984లో తన పరిశోదన ”ప్రాజెక్ట్‌ ఆన్‌ ఫ్రీడం స్ట్రగుల్‌” కోసం నగరానికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాంత ప్రజల పోరాట పటిమ, త్యాగం, వీరత్వాన్ని కొనియాడారు. అనంతరం ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ జనరల్‌ ప్రెసిడెంట్‌, జేఎన్‌యూ విశ్రాంత ఆచార్యులు ఆదిత్య ముఖర్జీ మాట్లాడుతూ.. చరిత్ర తుంగలో తోక్కబడుతుందని, నెహ్రును చాలా కఠోరంగా చూపిస్తున్నారని అన్నారు. నెహ్రును భారతదేశ ప్రజల మనస్సుల నుంచి చెరిపేసేలా అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. దేశ విభజన, పాకిస్తాన్‌, చైనా సమస్య, వ్యవసాయ సంక్షోభం, కాశ్మీర్‌ సమస్యతో పాటు ఇటీవల కాలంలో విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు, రాజ్యాంగ సవరణ, ప్రజాస్వామ్యానికి ప్రశ్నార్ధకాలుగా మారాయని ఆరోపించారు. సభాధ్యక్షులు ఆచార్య తాటికొండ రమేష్‌ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ వేదికగా 30 ఏండ్ల కిందట నిర్వహించిన ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ను గుర్తు చేస్తూ, తన హయంలో మరొక్కసారి నిర్వహించటం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ సెక్యులర్‌, ఫెడరల్‌, ప్రజాస్వామ్య విలువల రక్షణకు కృషి చేస్తూ చరిత్ర అధ్యాయానికి, భావ సంఘర్షణలకు, విజ్ఞాన మార్పిడికి ఒక ప్రధాన వేదికగా నిలుస్తుందన్నారు. శాస్త్రీయత, మతం పరస్పర వైరుధ్యాలను కలిగి ఉంటాయన్నారు. ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ సెక్రటరీ ప్రొఫెసర్‌ ఎస్‌ఎ.నదీం రేజావి మాట్లాడుతూ.. నియంతృత్వ, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ ఎలా పోరాడిందో వివరించారు. ఈ సందర్భంగా ప్రముఖ చరిత్ర కారులు రామచందర్‌ గుహకు లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు ప్రకటించారు. ఏడుగురి ఉత్తమ పుస్తకాలకు, 10 ఉత్తమ పత్రాలకు అవార్డులు, నగదు బహుమతిని ప్రకటించారు. ఈ సందర్భంగా 81వ కాంగ్రెస్‌ సమావేశాల పుస్తకాల సంపుటిని ఆవిష్కరించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య టి.శ్రీనివాసరావు స్వాగత ఉపన్యాసం చేశారు. లోకల్‌ హిస్టరీ కాంగ్రెస్‌ సెక్రటరీ ఆచార్య టి.మనోహర్‌ వందన సమర్పణ చేశారు. 1030కి పైగా పత్రాల సమర్పణ జరిగిందని, 1200 మంది ప్రతినిధులు దేశవ్యాప్తంగా హాజరుకాగా ఇద్దరు విదేశీ ప్రతినిధులు మహమ్మూద్‌ అహ్మద్‌ (ఉజ్బెకిస్తాన్‌), రీతు కందూరి (అమెరికా సంయక్త రాష్ట్రాల) నుంచి హాజరైనట్టు నిర్వాహకులు తెలిపారు.