నేటి భారతం

Today's Indiaపార్టికోలో ఉందది. పది అరబ్బీ గుర్రాలు కట్టేసిన పూలరథంలా ఉందది. ఇంద్రదేవుని మదపుటేనుగు ఐరావతంలా వుందది. ఆకాశంలోని చుక్కలన్నీ కరిగించి పోతపోసిన రెక్కల గరుడ వాహనంలా వుందది. రావణుడి పుష్పకవిమానం బాబులా వుందది. అది గాలిలో తేలే విమానంలా వుంది. నీటిలో తేలియాడే పడవలా వుంది. రోడ్డును కోసుకుంటూ పోయే సుడిగాలిలా వుంది.
‘డాడ్‌! అన్‌బిలీవబుల్‌! సూపర్బ్‌! ఎక్స్‌లెంట్‌’ అని అదేపనిగా అరవడం మొదలుపెట్టాడు సన్‌. అరవడం అయ్యాక రైడ్‌ చేస్తాను డాడ్‌ అని అడిగాడు. ‘యాజ్‌ యు విష్‌ మై సన్‌’ అన్నాడు డాడ్‌.
‘వద్దు సార్‌! అబ్బాయిగారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదు’ అన్నాడు సెక్రెట్రీ.
‘సోవాట్‌. హీ ఈజ్‌ మై సన్‌. దిసీజ్‌ హిజ్‌ డ్రీం కార్‌’ అన్నాడు ఫాదర్‌. ‘అబ్బాయి గారిది డ్రైవింగ్‌ ఏజ్‌ కాదు కదా’ అన్నాడు పి.ఎ.
‘సో వాట్‌’ అన్నాడు ఈ సారి సన్‌.
‘మీకసలు డ్రైవింగ్‌ కూడా రాదు కదా బాబుగారూ’ అన్నాడు వినయంగా అగంతకుడు.
‘సోవాట్‌’ అని మళ్లీ అనకుండా కారు ఎక్కుతూ ‘డ్రైవర్‌ డ్రైవ్‌ చేయడం చాలాసార్లు చూశా. నాకంతా తెల్సు డాడ్‌’ అన్నాడు అబ్బాయి.
ఫాదర్‌ చిరునవ్వు నవ్వాడు. సన్‌ ‘థంబ్‌’ చూపించాడు. కారు అరణ్యమున హరీంద్ర గర్జన చేసింది. చక్రాలు నాలుగూ, నేలను కోసేయి.
కారు రోడ్డుమీద నాగుపాములా జారిపోతున్నది. రోడ్డుమీద ఈ కారు ఒక్కటే లేదు. మనుషులన్నారు. వాహనాలున్నాయి. కారులో కుబేరుడి కొడుకున్నాడని ఎవరికీ తెలీదు. కుబేరుడి కొడుక్కు డ్రైవింగ్‌ రాదని ఎవరికీ తెలీదు. సరదాగా కారు రైడింగ్‌ చేస్తున్నవాడు డ్రైవింగ్‌ లైసెన్సే కాదు, సెన్సే కాదు, వయసు కూడా లేని, మీసాలు కూడా రానివాడని కూడా ఎవరికీ తెలీదు.
వీడెవరో అచ్చోసిన ఆంబోతులా వున్న నన్ను, నాలుగు చక్రాలకూ సరిపోయే నాలుగు ఫుల్‌ బాటిళ్ల ‘రమ్ము’ తాగేసిన రేసుగుర్రంలా వున్న నన్ను కంట్రోల్‌ చెయ్యలేడు అనుకుంది కారు. అడ్డదిడ్డంగా పరుగెత్తింది కారు. దారి తప్పి అడివిలోంచి ఊళ్లోకి వచ్చిన అడవి దున్నలా పరుగెత్తింది కారు. ముక్కుతాడు ఊడిపోయి ‘ఫ్రీడం’ని ఎంజారు చేస్తున్న యముడి దున్నపోతులా పరుగెత్తింది కారు.
ఆనంద పారవశ్యంలో వున్న కుబేరుడి కొడుకు అరికాలుకు, దేని తర్వాత దేన్ని ఒత్తిపట్టాలో తెలీలేదు. ఎదురుగ్గా వచ్చిన వాహనం మీద, దానిమీద కూచున్న మనుషుల మీద కారుకు కారుణ్యం లేదు. కారుణ్యం లేని కారు, ఒంటిమీద స్పృహలేని కారు, వేగంగా గాలిలో కానరాని గడుసు దయ్యంలా రెండు ప్రాణాల్ని గుద్దేసింది. గాలిలో ఎగరేసింది. రెండు పంచప్రాణాల్ని ధూళిలో కలిపేసింది.
పోలీసులు వచ్చారు. కారు ఎవరిదో తెల్సుకుని కళ్లు తేలేశారు. కారులో వున్న దొరబాబు ఎవరో తెల్సుకుని లాటీలు పారేసి, టోపీలు తీసేసి ముఖాలకు పౌడరులా నవ్వు పూసేశారు. కారు దిగండి బాబూ అన్నారు ప్రేమగా. కారు దిగండి బుజ్జిబాబూ అన్నారు ఆత్మీయంగా. మీకేం భయంలేదు, మేమున్నాం అండగా అన్నారు. మీరెప్పుడైనా పోలీస్‌ స్టేషన్‌ చూశారా బాబూ, సరదాగా చూద్దాం రండి అన్నాడో గుబురు మీసాల ఇన్‌స్పెక్టర్‌. అడ్వెంచర్‌ బాగుంటుంది, ఫన్నీగా వుంటుంది, భలేగా వుంటుంది, తమాషాగా వుంటుంది. రండి రండి! ప్లీజ్‌ ప్లీజ్‌ అన్నారు పక్కనున్న పోలీసులు. లాటీలు లేని పోలీసులు, టోపీలు తీసేసిన పోలీసులు. కుబేరులకీ, కుబేరుల కొడుకులకీ ఫ్రెండ్సయ్యే ఫ్రెండ్లీ పోలీసులు. డాడ్‌ కావాలి! డాడ్‌ రావాలి! అన్నాడు అబ్బాయి బుంగమూతి పెట్టి. వస్తారు, వచ్చేస్తారు, ఇలా వచ్చి అలా మిమ్ము తీసుకెళ్లిపోతారు. ఓన్లీ ఫిఫ్టీన్‌ మినిట్స్‌ కాదు, టెన్నే కాదు అయిదంటే అయిదే నిమిషాలు అని బతిమాలారు కొందరికి మాత్రమే ఫ్రెండ్స్‌గా వుండే ఫ్రెండ్లీ పోలీసులు.
అబ్బాయి ఠీవీగా నడిచాడు ఠాణాలోకి. పోలీస్‌కమిషనర్‌కు ఆర్డర్లు జారీ చేసే హోంమినిష్టర్లా నడిచాడు ఠాణాలోకి. మెత్తటి కుషన్‌ కుర్చీలో కూచోబెట్టారు అబ్బాయిని పోలీసులు.
ఆర్‌ యూ ఓకే అన్నాడో పోలీసులు. ఫీల్‌ఫ్రీ. ఇది నీ బాబు ఇల్లే అనుకో అన్నాడింకో ఖాకీ. ఫ్యాన్‌ వేశారొకరు. అప్పటికప్పుడు కూలర్‌లో నీళ్లు నింపి ఆన్‌ చేశారొకరు. అబ్బాయి కళ్లు స్టేషనంతా కలియదిరిగి చెత్తాచెదారం, దుమ్మూ ధూళీ ‘డిస్‌గస్టింగ్‌’గా, బ్రోంగా, అసహ్యంగా వున్నదీ ఠాణా అన్న ఎక్స్‌ప్రెషన్‌ని ముఖానికి అతికించేయి. అది అర్థం చేసుకోలేని పోలీసొకడు ఆకలిగావుందా బాబూ అన్నాడు. అది అపార్థం చేసుకున్న పోలీసొకడు పిజ్జానా, చికెన్‌బర్గరా, కూల్‌కేకా, ఇబాకో ఐస్‌క్రీమా అని బతిమిలాడాడు. అబ్బాయి తండ్రి వచ్చాడు. అబ్బాయి డాడీని హగ్‌ చేసుకున్నాడు. పోలీసువాళ్లు హేపీగా ఆ ఇద్దరికీ సెండాఫ్‌ ఇచ్చారు.
జడ్జిగారు బోన్‌లో వున్న అబ్బాయిని చూసి జాలిపడ్డారు. అరెరే ముక్కుపచ్చలారని పసివాడే, మిసాలేరాని బుడ్డోడే అని జాలిపడ్డారు. గ్యాలరీలో వున్న బాబు బడాబాబును చూశాడు. ప్రాసిక్యూటర్‌ను అమాయకుడైన అబ్బాయి ప్రశ్నలు అడక్కుండా కట్టడి చేశాడు. అబ్బాయిని ఉద్దేశించి నువ్వు చేసింది పెద్ద తప్పేమీ కాదు. మనదేశంలో రోడ్లమీద మనుషులూ, కుక్కలూ నిత్యం గుర్తుతెలీని వాహనాలకు ప్రాణాలు పోగొట్టుకోవడం సహజమే. నువ్వు తెలియక చేసింది తప్పుకాదు. నువ్వు తెలిసి తప్పు చెయ్యలేదు. నీకు బంగారు భవిష్యత్తు వుంది. అయితే ఎంతోకొంత ఏదో కొంత శిక్ష వేయాలి కదా. నువ్వొక మూడువందల పదాల వ్యాసం రాస్తావా ఆవుమీద అన్నాడు.
అబ్బాయి నేను ఆవును ఎప్పుడూ చూడలేదు అన్నాడు. నా పెట్‌డాగ్‌ అంటే నాకెంతో ఇష్టం అన్నాడు. అయితే ఇంకేం, కుక్క సారీ పెట్‌ డాగ్‌ మీద ఓ వ్యాసం రాయి. అదే నీకు శిక్ష అంటూ తీర్పు ఇచ్చారు జడ్జిగారు.

– చింతపట్ల సుదర్శన్‌, 9299809212